Mon Dec 23 2024 07:55:50 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కు ఇక తలనొప్పులు తప్పేట్లు లేవుగా? బెజవాడ టు హైదరాబాద్ తిరగాల్సిందేనా?
వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి ఇకపై రోజు వారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.
వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి ఇకపై రోజు వారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన కేసుల్లో ప్రతి రోజు విచారణ జరుగుతుంది. కొన్నేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కేసులన్నీ త్వరిత గతిన పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇక సీబీఐ కోర్టులో విచారణలు స్పీడ్ అందుకోనున్నాయి. కేసుల విచారణకు ఇప్పటి వరకూ జగన్ హాజరు కాలేదు. ఇప్పటి వరకూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయన న్యాయస్థానం నుంచి మినహాయింపులు తెచ్చుకున్నారు. విచారణకు హాజరు కాకుండా గత ఐదేళ్ల నుంచి నెట్టుకొస్తున్నారు. కానీ ఇకపై అలా కుదరదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
పిలిచినప్పుడు...
వైఎస్ జగన్ న్యాయస్థానంలో కేసుల విచారణ సమయంలో పిలిచినప్పుడు హాజరు కావాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాకపోవడంతో న్యాయస్థానం నుంచి ఎలాంటి మినహాయింపులు లభించవని న్యాయనిపుణులు చెబుతున్నారు. అవసరమైతే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినా ఆయన హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కాక తప్పదని సీనియర్ న్యాయవాది ఒకరు చెప్పారు. అయితే జగన్ కూడా తన హాజరు నుంచి మినహాయింపును కోరే అవకాశముందని, అందుకు న్యాయస్థానం అనుమతిస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు చూడాల్సి ఉంటుందన్నారు.
రాజకీయంగా చూసినా...
ఇప్పుడు జగన్ కు రాజకీయంగా కూడా పెద్దగా సాయం అందే అవకాశాలు లేవన్నది సుస్పష్టం. జాతీయ, రాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే జగన్ తప్పనిసిరిగా న్యాయస్థానం ఎదుటకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. అయితే జగన్ పై నమోదయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏ ఒక్కటి నిలబడే అవకాశం లేదని కూడా న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే న్యాయస్థానానికి మాత్రం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ కు రానున్న కాలమంతా చాలా కష్టాలను తెచ్చిపెడుతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే అన్నింటికీ తమ పార్టీ అధినేత సిద్ధంగా ఉన్నారంటున్నారు వైసీపీ నేతలు మరి ఏం జరుగుతుంది? ఎంత కాలం సాగుతుందన్నది మాత్రం వెయిట్ చేయాల్సిందే.
Next Story