రొంపిచర్ల చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి..పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
నిర్లక్ష్యపు నీడలో కాకతీయ శాసనాలు- భద్రపరచాలంటున్న శివనాగిరెడ్డి
నిర్లక్ష్యపు నీడలో కాకతీయ శాసనాలు- భద్రపరచాలంటున్న శివనాగిరెడ్డి
విజయవాడ, డిసెంబర్, 27: పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామ శివారులోని వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద, వెళ్లే దారిలో గల నిర్లక్ష్యానికి గురైన క్రీ.శ. 10-13 శతాబ్దాల నాటి శిల్పాలు, శాసనాలను భద్రపరిచి, కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సిఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వారసత్వ సంపదను గుర్తించి, పరిరక్షించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నాడు, రొంపిచర్లలో పర్యటించి అనేక చారిత్రక ఆనవాళ్లను గుర్తించారు. ఊరు బయట, వినాయక ఆలయం ముందు రోడ్డుపైన, మదన గోపాల దేవాలయానికి వెళ్లే దారిలో, క్రీ.శ 10వ శతాబ్దికి చెందిన మహిషాసురమర్దిని, బ్రహ్మ, కుమారస్వామి, భైరవ, నంది విగ్రహాలు, ఇంకా కాకతీయ గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు విడుదల చేసిన రాతి శాసనాలు ఆలనా పాలనా లేక గడ్డి, గాదం మధ్య పడి ఉన్నాయన్నారు. తేది లేని గణపతి దేవుని శాసనం లో స్థానిక కేశవ దేవునికి, క్రీ.శ. 1320 నాటి ప్రతాపరుద్రుని శాసనంలో స్థానిక అనంత గోపీనాథ దేవుని అమావాస్య కొలుపులకు రెడ్ల చెరువు వెనక కొంత భూమిని దానం చేసిన వివరాలు, అలాగే క్రీ.శ. 1245 నాటి కోట భీమరాజు మంత్రి వల్లభుడు, రొంపిచర్లలో కట్టించిన గోపీనాథ ఆలయానికి కొంత భూమిని దానం చేసిన వివరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రొంపిచర్ల గ్రామ చరిత్రకు సాక్షలైన ఈ శిల్పాలు, శాసనాలు కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులుకు, ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల్ శ్రీనివాస్ పద్మ వంశీ, స్థపతి బి. వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now