Tue Nov 05 2024 14:39:56 GMT+0000 (Coordinated Universal Time)
అత్యాచార ఘటనలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి
రేపల్లె ఘటనలో దుండగులు ఉద్దేశపూర్వకంగా బాధితురాలిపై అత్యాచారం చేయలేదన్నారు. మద్యంమత్తులో ఉన్న నిందితులు..
గుంటూరు : వివాదాస్పద వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి తానేటి వనిత కేరాఫ్ అడ్రస్ గా మారారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తల్లుల పెంపకాన్ని బట్టే ఇలాంటి ఘటనలు జరుగుతాయని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి.. మళ్లీ విమర్శల పాలయ్యారు తానేటి వనిత. రేపల్లె అత్యాచార ఘటనపై స్పందించిన మంత్రి.. రాష్ట్రంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని అనడం విమర్శలకు కారణమైంది.
రంజాన్ సందర్భంగా నిన్న గుంటూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వనిత.. మీడియాతో మాట్లాడారు. రేపల్లె ఘటనలో దుండగులు ఉద్దేశపూర్వకంగా బాధితురాలిపై అత్యాచారం చేయలేదన్నారు. మద్యంమత్తులో ఉన్న నిందితులు.. డబ్బుల కోసం బాధితురాలి భర్తపై దాడి చేశారని, భర్తను రక్షించుకోవడానికి ఆమె వెళ్లినప్పుడు నిందితులు ఆమెను నెట్టేసే విధానం, బంధించే విధానంలోనే అత్యాచారానికి గురైనట్లు చెప్పుకొచ్చారు. పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయన్న హోంమంత్రి.. మహిళపై జరిగిన అత్యాచారానికి, పోలీసు సిబ్బంది కొరతకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. అత్యాచార ఘటనలపై తానేటి వనిత చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
Next Story