Mon Dec 23 2024 03:06:29 GMT+0000 (Coordinated Universal Time)
Cock Fight : కరెన్సీ కట్టలు అలవోకగా ఆవిరయిపోయాయిగా... ఎవరి జేబుల్లోకి వెళ్లింది?
సంక్రాంతి పండగ కోడిపందేల్లో వందల కోట్లు చేతులు మారినట్లు తెలిసింది. పందేలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
సంక్రాంతి పండగ కోడిపందేల్లో వందల కోట్లు చేతులు మారినట్లు తెలిసింది. పెద్దయెత్తున భారీగా పందేలు కాయడంతో రెండు రోజుల్లోనూ వంద కోట్ల మేర బెట్టింగ్ లు జరిగాయని సమాచారం. ఈరోజు కనుమ కావడంతో మరింతగా పందెంరాయుళ్లు రెచ్చిపోతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. క్రికెట్ గ్రౌండ్స్ ను మరిపించేలా కోడి పందేల బరులను ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలను సమకూర్చడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కోడి పందేలను వీక్షించేందుకు పెద్దయెత్తున జనం తరలి వచ్చారు. పోలీసుల ఆంక్షలు ఏమాత్రం పనిచేయలేదు. యధేచ్ఛగా పందేలు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే 250 బరులున్నాయి.
క్రికెట్ గ్రౌండ్ ను తలపించే బరులు...
ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బరులు ఎక్కువగా ఈ ఏడాది ఏర్పాటు చేశారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇటు అధికార వైసీపీతో పాటు అటు ప్రతిపక్ష వైసీపీలు కూడా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో జనం ఇక్కడకు క్యూకట్టారు. ఇక తెలంగాణ మద్యం కూడా ఇక్కడ ఏరులై పారింది. ప్రతి వాళ్లు తెలంగాణ నుంచి మద్యం బాటిల్స్ ను అక్కడకు తీసుకువచ్చి తాగుతున్నారు. అలాగే కొందరు మద్యం వ్యాపారులు కూడా బరుల వద్ద తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తుండటం కనిపించింది. అయినా ఎక్సైజ్ పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు తప్పించి వారి జోలికి మాత్రం పోలేదు.
ఖరీదైన కార్లతో...
ఇక ఖరీదైన కార్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ అత్యంత ఖరీదైన కార్లు కూడా బరుల వద్ద కనిపిస్తున్నాయి. అంతా క్యాష్ తోనే పందేలు కాస్తున్నారు. కొన్ని చోట్ల గూగుల్, పేటీఎం ద్వారా పే చేసే సౌకర్యం కల్పించినా ఎక్కువ మంది కరెన్సీ కట్టలనే తీసుకు వచ్చి పందేలు కాస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో జరిగిన ఒక బరిలో ఒక్క పందెంలో దాదాపు యాభై లక్షలు చేతులు మారినట్లు తెలిసింది. కరెన్సీని లెక్కపెట్టేందుకు అక్కడకు మనీ కౌంటింగ్ మిషన్లు కూడా తెచ్చారంటే ఏ స్థాయిలో పందెం రాయుళ్లు ఈసారి రెచ్చిపోయారో వేరే చెప్పాల్సిన పనిలేదు.
పై పందేలు కూడా...
అన్నీ ఐదు వందల నోట్ల కట్టలే. వంద నోటు అనేది అక్కడ కనిపించదు. ఒక్కొక్క బరి వద్ద లక్షల రూపాయల మేరకు పందేలు జరుగుతుండటంతో పందెంరాయుళ్లు క్యూ కట్టారు. అవతలోడు లక్ష అంటే పది లక్షలు అంటూ వస్తున్నారు. ఇక పై పందేలకు కూడా కొదవలేదు. కోళ్లపై పందేలు మాత్రమే కాకుండా బరుల బయట పెద్దయెత్తున పై పందేలు కూడా జరుగుతున్నాయి. పై పందేలే లక్షల రూపాయలు జరుగుతుండటంతో వందల కోట్లు దాటేసిందని చెబుతున్నారు. ఈరోజు మరీ పీక్ కు వెళ్లే అవకాశాలున్నాయి. అందుకే చలో భీమవరం అంటూ ఖరీదైన బాబులు కోట్ల రూపాయలు చేతబట్టి బయలుదేరి వెళ్లారు.
Next Story