Mon Dec 23 2024 08:05:42 GMT+0000 (Coordinated Universal Time)
కోరలు చాస్తోన్న H3N2.. తెలుగు రాష్ట్రాల్లో విజృంభణ
తెలంగాణలో జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. వ్యాధి నిర్థారణ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు..
తెలుగు రాష్ట్రాల్లో H3N2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఐసీఎంఆర్ అప్రమత్తం చేసింది. పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండటంతో పాటు పర్యాటక రంగం ఊపందుకోవడంతో.. H3N2 వైరస్ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంది. వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు విదేశీయులు క్యూ కట్టడం కూడా వైరస్ వ్యాప్తికి ఒక కారణంగా పేర్కొన్న ఐసీఎంఆర్.. ప్రజలు మాస్కులు వాడకపోవడం మరో కారణమని తెలిపింది.
తెలంగాణలో జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. వ్యాధి నిర్థారణ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటికే రెండు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీతో హెచ్3ఎన్2 వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాధి నిర్థారణ పరీక్షలకై రక్తనమూనాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపిస్తున్నట్టు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. కే. శంకర్ తెలిపారు. హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరిగితే.. వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఫీవర్ ఆసుపత్రితో పాటూ వరంగల్, అదిలాబాద్‌లోనూ ప్రారంభిస్తామని తెలిపారు. కొవిడ్, చికున్‌గున్యా నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించిన ఎక్విప్‌మెంట్‌తోనే హెచ్3ఎన్2 వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్టు వివరించారు.
- Tags
- H3N2 virus
- ICMR
Next Story