Fri Nov 22 2024 20:50:30 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మళ్లీ గ్రిప్ రావాలంటే జగన్ కు ఆషామాషీ కాదు... వ్యూహం మార్చాల్సిందేనా?
వైఎస్ జగన్ నాయకత్వంపై మళ్లీ నేతలకు, క్యాడర్ కు భరోసా కలగాలంటే శ్రమించాల్సి ఉంటుంది.
వైఎస్ జగన్ నాయకత్వంపై మళ్లీ నేతలకు, క్యాడర్ కు భరోసా కలగాలంటే శ్రమించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి కాదు. ఈసారి జగన్ ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే. అప్పటికాని ఆయన మళ్లీ గ్రిప్ అందదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇటీవల జరిగిన ఓటమితో క్యాడర్తో పాటు నేతలు కూడా బాగా కుంగిపోయి ఉన్నారు. ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారు. గత ఐదేళ్లలో వాళ్లు సంపాదించుకుంది లేదు. సాధించింది లేదు. జగన్ వైపు ఇప్పటికిప్పుడు నిలబడాలంటే కేసులకు వెరుస్తారు. అలాగే ఇప్పడే మనం బయటకు వచ్చి చేతి చమురు వదుల్చుకోవడం ఎందుకన్న ధోరణిలో అనేక మంది నేతలున్నారు. వారి మనసులను మార్చాలంటే మామూలు విషయం కాదు.
సొంత నియోజకవర్గాలు కాదని..
వాళ్లకు స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు గత ఎన్నికల సమయంలో చాలా మందిని తమ సొంత నియోజకవర్గాల నుంచి ఇతర నియోజకవర్గాలకు పంపారు. నాడు అయిష్టంగానే అక్కడకు వెళ్లారు. కానీ అక్కడ మనసు పెట్టి పనిచేయరు. తమ సొంత నియజకవర్గంలోనే పనిచేయాలని ఏ నేత అయినా భావిస్తారు. అంతే తప్ప వేరే చోటకు వెళ్లి అక్కడ నాయకులను, క్యాడర్ ను కాపాడాల్సిన బాధ్యతను భుజాన వేసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు. చాలా మంది ఇదే ధోరణిలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో గెలుపు లక్ష్యంగా జగన్ భారీగా నియోజకవర్గాలను మార్చి కొత్త విధానానికి శ్రీకారం చుట్టినా అది సత్ఫలితాలనివ్వలేదు. అందుకే ఓడిపోయిన వారంతా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికే చాలా మంది నేతలు పాత నియోజకవర్గాలకు తమ నివాసాలను షిఫ్ట్ చేశారు.
కొన్ని నియోజకవర్గాల్లో...
దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులు లేకుండా పోయారు. దీంతో 175 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులున్నప్పటికీ ఎక్కువ భాగం ఓటమి పాలు కావడంతో కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో చేసిన కొన్ని ప్రయోగాలు వికటించాయి. అక్కడ బలమైన సామాజికవర్గాలను పట్టించుకోకుండా తమ నెత్తిన వేరే నేతలను రుద్దారన్న ఆగ్రహం కూడా స్థానిక నేతలపై ఉంది. అందుకే ఆ స్థానాల్లో మళ్లీ పాత వారిని నియమించడమా? లేక కొత్తవారికి అక్కడ ఇన్ఛార్జి పెట్టి పార్టీ కార్యకలాపాలను గాడిన పెట్టడమా? అన్నది ఆలోచన చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత సమయం తీసుకునయినా నేతల అభీష్టం మేరకే పార్టీ ఇన్ఛార్జుల నియామకం జరగాలి. అప్పుడే నేతలు, క్యాడర్ పార్టీ కోసం మనసు పెట్టి పనిచేస్తుంది.
ఎప్పటిలాగే...
అంతే తప్ప ఎప్పటిలాగే బలవంతంగా రుద్దితే మాత్రం ఎవరూ సరిగా పనిచేయరు. అది పార్టీకి దీర్ఘకాలంలో ఇబ్బంది అవుతుందన్న ఆందోళన కూడా నేతల్లో ఉంది. అందుకే ప్రతి నియోజకవర్గాన్ని సమీక్ష చేయాలి. అక్కడ ద్వితీయ స్థాయి నేతలతో జగన్ స్వయంగా సమావేశమై వారికి కావాల్సిన నాయకత్వాన్ని వారు ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలని కొందరు సూచిస్తున్నారు. అప్పుడే ఇప్పటికిప్పుడు కాకపోయినా కనీసం ఏడాదికయినా పార్టీ మళ్లీ పుంజుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఈ లోపు పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రక్షాళన జరగాల్సి ఉంటుంది. అంతే తప్ప మళ్లీ తన ఫొటోనే గెలిపిస్తుందన్న ధోరణిని జగన్ అవలంబిస్తే మాత్రం మళ్లీ బూమ్రాంగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
Next Story