Sat Nov 16 2024 12:25:40 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నాడు నువ్వు సక్రమంగా చేసుంటే.. ఇప్పుడు ఇంత ఆవేశపడే అవకాశమెందుకుంటుంది?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాడు అధికారంలో ఉన్నప్పుడు సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు
వైఎస్ జగన్ సుద్దులు చెబుతున్నారు. ఎదుటి వాడికి నీతులు చెప్పేటప్పుడు తాను ఐదేళ్ల పాటు చేసిందేమిటో గుర్తుంచుకోవాలి. నాడు తన పాలనలో సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావు కదా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. నాడు ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, కనీసం దానిపై సమగ్రమైన విచారణ జరిపించకుండా ప్రత్యర్థులకు న్యాయం చేయకపోతే ఇప్పుడు వాళ్ల సమయం వచ్చింది. దాడులు చేయడం, అడ్డగించడం తప్పే. దానిని ఎవరూ కాదనలేరు. కానీ గతంలో నువ్వునేర్పిన విద్యనే వాళ్లు ఇప్పుడు అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నారు.
ఎక్కడకు వెళ్లకుండా...
నాడు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబును తిరుపతికి కూడా వెళ్లనియ్యలేదు. తిరుపతి ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని వెనక్కు పంపేశారు ఇక చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక రగడ చేయాల్సిందే. తన సొంత జిల్లాలో కూడా చంద్రబాబు సక్రమంగా తిరగలేని పరిస్థితిని తెచ్చింది తమరు కాదా? అన్న విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. ఎన్ని కేసులు.. ప్రశ్నిస్తే కేసులు.. రోడ్డు మీదకు వస్తే అక్రమ కేసులు.. ఇలా భయపెట్టి ఐదేళ్లు పరిపాలన చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు ఎందుకు ఇలా జరగుతుందన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎవరినీ వదలకుండా...
రాజకీయ నేతలను అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర ఇలా ఒక్కరేమిటి వయసుతో నిమిత్తం లేకుండా చివరకు చంద్రబాబును కూడా జైల్లోకి నెట్టిన విషయాన్ని టీడీపీ నేతలు అంత సులువుగా మర్చిపోయే విషయం కాదు గదా? ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, రాష్ట్రపతిపాలన విధించాలంటూ డిమాండ్ చేయడాన్ని చూసేవారు.. వినేవారు.. నవ్వుకోవడానికి తప్ప మరి దేనికీ ఆ నినాదాలు పనికిరాకుండా పోతాయి జగనన్నా. అందుకే అధికారంలో ఉన్న ప్పుడు తాము ఏం చేస్తున్నామో గుర్తు తెచ్చుకోవాలి. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో క్యాడర్ ను అదుపులో ఉంచుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు.
మధ్యలో బలయ్యేది మాత్రం...
కానీ మధ్యలో బలయ్యేది మాత్రం సామాన్యకార్యకర్తలే. ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేసినా.. మోదీని కలిసినా ప్రత్యేకంగా ఒరిగేదేమీలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ ఉండదు. పోలీసు అధికారులను కూడా తమ పాలనలో గ్రిప్ లో పెట్టుకుని అంతా సకల శాఖ మంత్రి నడిపారన్న ఆరోపణలు నాడు వినిపించాయి. ఇప్పుడు వాళ్లు కూడా అదే చేస్తున్నారు. ఇందులో పెద్దగా తేడా ఏమీ లేదు. కాకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్ కు, 2019 నుంచి ఇప్పుడు జరుగుతున్న పాలన వరకూ స్పష్టమైన తేడా మాత్రం కొంత కొట్టొచ్చినట్లు కనపడుతూనే ఉంది. ఇది బిగినింగే.. మున్ముందు ఇంకెన్ని జరుగుతాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. అందుకే రాజకీయ నేతలు ఎవరూ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోతే.. కోల్పోయాక దాని ప్రతిఫలాన్ని చవిచూడకతప్పదన్న సామెతను ఏపీ రాజకీయలు రుజువు చేస్తున్నాయి.
Next Story