Mon Dec 23 2024 07:03:20 GMT+0000 (Coordinated Universal Time)
మార్గదర్శిలో అవకతవకలు నిజమే.. త్వరలో షోకాజ్ నోటీసులు
మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ సోదాలలో సిబ్బంది తమకు సహకరించలేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ తో పాటు అనేక సంస్థల్లో చేపట్టిన సోదాల్లో అవకతవకలు జరిగాయని స్పష్టమయిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో సిబ్బంది తమకు సహకరించలేదని ఆయన తెలిపారు. తమ శాఖ అధికారులకు సహకరించని చిట్‌ఫండ్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే మార్గదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఫోరెన్సిక్ ఆడిట్ కూడా..
మూడు రోజుల పాటు తమ శాఖ మార్గదర్శితో పాటు 16 చిట్‌ఫండ్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిందని ఆయన తెలిపారు. అంతే కాకుండా మార్గదర్శి చిట్ లో ఫోరెన్సిక్ ఆడిట్ ను కూడా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మొత్తం మూడు దశల్లో సోదాలు నిర్వహించామని ఆయన వివరించారు. అనంతర చర్యలకు సిద్థమవుతున్నామని తెలిపారు. తెలంగాణ అధికారుల సహాకారంతో హైదరాబాద్ లోని సంస్థల్లోనూ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
వివిధ చిట్ ఫండ్ కంపెనీలపై...
2018లోనే తాము కపిల్ చిట్ ఫండ్స్ పై చర్యలు తీసుకున్నామని, కపిల్ చిట్ ఫండ్స్ కు 2022 వరకూ కొత్త చిట్స్ ఇష్యూ చేయడానికి అనుమతి లేదన్న విషయాన్ని ఆయన తెలిపారు. 2018లో కూడా మార్గదర్శి బ్యాంకు స్టేట్మెంట్లు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీ పేరిట డిపాజిట్లను సేకరించడం, వడ్డీ సరిగా చెల్లించకపోవడం, ప్రత్యేక బ్యాలెన్స్ షీట్లు నిర్వహించకపోవడం వంటి వాటికి ఎస్టీఆర్ చిట్స్ అండ్ ఫైనాన్స్ తో పాటు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలు కూడా నిబంధనలు ఉల్లంఘించాయని ఆయన తెలిపారు. ఏపీ చిట్స్ రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసులు జారీ చేస్తారన్నారు. తమకు ఏ సంస్థ పైనా కక్ష లేదన్నారు. తమ విచారణకు సహకరించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Next Story