ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు
రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు దేశం మొత్తం నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను తాకుతుందని, దీనివల్ల గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబరు 23న అల్పపీడనంగా, ఆపై బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 24నాటికి అల్పపీడనం ఉత్తరంవైపు తిరిగి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర-ఈశాన్య దిశగా పయనించి అక్టోబర్ 25న ఒడిశా తీరాన్ని దాటి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.