Mon Dec 23 2024 08:24:45 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రజలకు చల్లని కబురు.. నాలుగురోజులు భారీ వర్షాలు
వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. 17, 18, 19 తేదీల్లో..
వేసవికాలం మొదలై 15 రోజులైనా కాలేదు. అప్పుడే మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఉక్కపోత, మండుటెండలకు ఇప్పుడే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ముందు ముందు ఎండలెలా ఉంటాయో అని భయాందోళనలకు గురవుతున్నాయి. మండుటెండలతో సతమతమవుతున్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.
ముందున్న సమాచారం ప్రకారం మార్చి 16 నుంచి వర్షాలు కురవాల్సింది. కానీ.. ఒక రోజు ముందు నుంచే.. అంటే నేటి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తాజాగా వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధవారం నుంచి 4 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. 17, 18, 19 తేదీల్లో విశాఖ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే.. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ వివరించింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రైతులు పంటలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Next Story