Thu Dec 19 2024 15:13:17 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus for Women : మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని హడావిడిగా అమలు చేస్తే అభాసుపాలు కావడమే
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే ఆషామాఫీ కాదు. ముందుగా అన్ని చర్యలు తీసుకోవాలి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే ఆషామాఫీ కాదు. ముందుగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్న తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలి. లేకుంటే మాత్రం ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం హడావిడిగా అమలుచేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బస్సులు లేకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయలేరు. ఫ్రీ బస్సు అమలు చేయాలంటే తగినన్ని బస్సులు అవసరం. అందుకోసమే ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సమస్యలై వివరించేందుకు ఒక నివేదికను సిద్ధం చేశారు.
అదనంగా...
నేడు చంద్రబాబు రవాణా శాఖ సమీక్షలో ఈ నివేదికను పరిశీలించి ఫ్రీ బస్సు ప్రయాణంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు విధానాన్ని అథ్యయనం చేసి వచ్చిన రవాణా శాఖ అధికారులు అదనంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో పాటు 3,500 మంది ఆర్టీసీ డ్రైవర్లు అవసరమని కూడా వారు చెప్పనున్నారు. ఇక ప్రతి నెల ఆర్టీసీకి 250 నుంచి 280 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర విస్తీర్ణం ఎక్కువగా ఉండటం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రయివేటు వాహనాలు...
ప్రస్తుతం ఆర్టీసీలో కేవలం పదివేల బస్సులు మాత్రమే ఉన్నాయని, అవి ఉచిత బస్సు ప్రయాణానికి సరిపోవు. హడావిడిగా అమలు చేస్తే బస్సుల్లో కొట్లాటలు తప్పవు. బస్సుల్లో రద్దీ పెరిగినప్పుడు ప్రయివేటు వాహనాలు, ప్రయివేటు బస్సులు ఎక్కువగా లాభ పడే అవకాశముందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన వెంటనే ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుందని, దానికి సరిపడా బస్సులు, సిబ్బంది లేకపోతే ఇబ్బందులు తప్పవని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ప్రయివేటు వాహనాలు ప్రయోజనం పొందకుండా ఉండాలంటే అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుని పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం అభాసుపాలు కాక తప్పదని ప్రభుత్వానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story