Sun Dec 22 2024 22:59:39 GMT+0000 (Coordinated Universal Time)
Tg Venkatesh : టీజీ వెంకటేశ్ కు మళ్లీ పదవి రెడీగా ఉందా?
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేత టీజీ వెంకటేశ్ త్వరలోనే పదవి లభిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేత టీజీ వెంకటేశ్ త్వరలోనే పదవి లభిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. భారతీయ జనతా పార్టీ ఆయనకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందంటున్నారు. ఈ మేరకు హైకమాండ్ వద్ద కూడా ప్రతిపాదనలున్నాయని చెబుతున్నారు. టీజీ వెంకటేశ్ 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయితే కర్నూలు పట్టణ నియోజకవర్గం నుంచి ఓటమిపాలు కావడంతో ఆయనకు టీడీపీ నుంచి రాజ్యసభ పదవి దక్కింది. టీడీపీలో కీలకంగా ఉన్న టీజీ వెంకటేశ్ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో ఓటమి పాలయిన తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు.
పెద్దల దృష్టిలో...
ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన బీజేపీ పెద్దలను ఆకట్టుకున్నారు. వారి దృష్టిలో పడ్డారు. టీజీ వెంకటేశ్ కేవలం సామాజికవర్గం పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా బలవంతుడు కావడం ఆయనకు అదనపు బలం అయింది. ఢిల్లీలో ఆయనకున్న పరిచయాలను గత మూడేళ్లలో పెంచుకున్నారు. నేరుగా మోదీ, అమిత్ షాతో ఆయన పరిచయాలను బాగా పెంచుకున్నారు. తన కుమారుడు టీజీ భరత్ ను మాత్రం 2014 నుంచి టీడీపీలోనే ఉంచారు. టీజీ భరత్ 2019 ఎన్నికలలో కర్నూలు నుంచి ఓటమి పాలయినా 2024 లో మళ్లీ అదే టీడీపీ నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా చేరారు.
కుమారుడు మంత్రిగా...
కుమారుడి రాజకీయ భవిష్యత్ లో టీజీ వెంకటేశ్ కు ఇక దిగులు లేదు. అయితే తన వయసు మించి పోవడంతో ఇక ప్రత్యక్ష ఎన్నికలకు ఆయన దాదాపు దూరమయినట్లే. అయితే రాజకీయాలను వదిలే అవకాశం మాత్రం లేదు. కమలం పార్టీలోనే ఉంటూ ఎదగాలన్నది ఆయన ఆలోచన. కర్నూలులోనే ఉండి ఆయన హస్తిన పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. కమలం పార్టీని రాయలసీమలో బలోపేతం చేయాలను కుంటే తన ఏదో ఒక గౌరవమైన పదవి ఇవ్వాలని టీజీ వెంకటేశ్ కోరినట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు టీజీ వెంకటేశ్ కు దక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే అవి టీడీపీ, జనసేనలకు రిజర్వ్ అయిపోయాయి.
కొంత మైనస్ అయినా...
టీడీపీ నుంచి వచ్చిన నేత కావడం కొంత టీజీ వెంకటేశ్ కు మైనస్ అయినా ఆయన పార్టీ ఆర్థిక అవసరాలను తీర్చే నాయకుడు కావడంతో బీజేపీ పెద్దలు కూడా టీజీ వెంకటేశ్ కు పదవి ఇచ్చేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. ఆయన వయసును గౌరవిస్తూ గవర్నర్ పదవిని ఇవ్వాలని దాదాపు నిర్ణయం జరిగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు టీజీ వెంకటేశ్ తన సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నట్లు తెలిసింది. ఆయనకు ముఖ్యమైన రాష్ట్రానికి గవర్నర్ గా అతిత్వరలోనే నియమిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. మరి టీజీ వెంకటేశ్ కు గవర్నర్ పదవి దక్కుతుందా? లేదా? అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Next Story