Tue Nov 05 2024 13:36:45 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో మహిళలకు త్వరలోనే గుడ్ న్యూస్.. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వరసగా ఎన్నికల హామీలను అమలుపరుస్తూ వెళుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వరసగా ఎన్నికల హామీలను అమలుపరుస్తూ వెళుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీ, రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛనుదారుల కోసం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచే, పేదల కోసం అన్నా కాంటిన్లు, నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వరసగా హామీలను అమలు చేస్తూ వెళుతున్న చంద్రబాబు మరో హామీపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిసింది. మహిళల కోసం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీని కూడా త్వరలో అమలు పర్చనున్నారని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అనేక హామీలు...
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ఇచ్చారు. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో వినియోగించే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో చంద్రబాబు మహిళలను ఆకట్టుకునేందుకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇస్తామని సూపర్ సిక్స్ లో ప్రకటించారు. మహిళలు ఎక్కువగా ఈ హామీకి అట్రాక్ట్ అయి అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడమే కాకుండా గంటల తరబడి వేచి ఉండి కూటమి అభ్యర్థుల విజయానికి కారణంలో ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్న అభిప్రాయం ఉంది.
ఏడాదికి మూడు...
అందుకే చంద్రబాబు ఈ హామీని అమలు చేయాలని నిర్ణయించారు. ఒక కుటుంబానికి వాడే సిలిండర్ రెండు నుంచి మూడు నెలలు వస్తుంది. అంటే ఏడాదికి మూడు సిలిండర్లు అంటే దాదాపు తొమ్మిది నెలలు ఉచితంగా మహిళలు గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశముంది. గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 900 రూపాయలు ఉండటంతో ఫ్రీగా ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. జులై నెల మొదటి వారం నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని కూడా అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క సిలిండర్ కాబట్టి పెద్దగా ఆర్థిక భారం కూడా ప్రభుత్వంపై జులైలో పడే అవకాశం లేకపోవడంతో ఈ హామీని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
విధివిధానాలను...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందల రూపాయలకే ఇస్తూ వస్తుంది. తెలంగాణలో తెల్ల కార్డులున్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేస్తుంది. తొలుత గ్యాస్ సిలిండర్ కు డబ్బు చెల్లిస్తే వెంటనే ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటుందా? లేక నేరుగా గ్యాస్ కంపెనీలకు చెల్లించేలా ఒప్పందం రూపొందిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. పేదలకు మాత్రమే ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద అంతా సవ్యంగా జరిగితే జులై నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరి జులై నుంచి వంటింట్లో సూపర్ సిక్స్ కొట్టినట్లే మరి.
Next Story