Tue Apr 08 2025 00:34:58 GMT+0000 (Coordinated Universal Time)
TDP Vs Janasena : దెందులూరులో జనసేన vs టీడీపీ.. కొట్టుకుంటున్నారుగా?
అనేక నియోజకవర్గాల్లో మిత్ర పక్షాల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తుంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో మిత్ర పక్షాల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తుంది. మద్యం దుకాణాల కేటాయింపు, ఇసుక సిండికేట్లు, నామినేటెడ్ పదవుల విషయంలో ఇలా ప్రతి విషయంలో ఒకరినొకరిపై విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా కూటమి పార్టీలు స్వీప్ చేసిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ ఆధిపత్య పోరు ఎక్కువగా కనపడుతుంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ కూటమి నేతల మధ్య విభేదాలు పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారాయి.
పింఛన్ల పంపిణీలో...
ప్రధానంగా పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఈరోజు అనేక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. తాము పింఛను పంపిణీ చేయాలని ఒకరంటే.. తాము కూడా భాగస్వామ్యులవుతామని జనసేన నేతలు కూడా రెడీ అవుతుండటంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరెవ్వరంటూ టీడీపీ నేతలు జనసేన నేతలను ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసి, అభ్యర్థి విజయానికి ఇద్దరూ కృషి చేసినప్పటికీ, తర్వాత మాత్రం అనేక అంశాలు విభేదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విభేదాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
చింతమనేని ఏమన్నారంటే?
పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు, చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. వీరు ఒకరినొకరు వీధుల్లోకి వచ్చి తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. ఇది పెద్ద పంచాయతీగా మారింది. అయితే దెందులూరులో విభేదాలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు.కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరారని,పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారని చింతమనేని అన్నారు.చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిదని,పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు.గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని కోరారు.ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది వీళ్లేనని, ఇప్పుడుపార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. జనసేన అధినాయకత్వంతో తాను మాట్లాడతానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
Next Story