Wed Dec 25 2024 14:40:14 GMT+0000 (Coordinated Universal Time)
Guarantees : కర్ణాటకను చూస్తే తెలుగోళ్లకు కూడా భయమేస్తుందిగా.. గ్యారంటీలు తెచ్చిన బాధలు అంతా ఇంతా కాదయా?
కర్ణాటకలో వరసగా ప్రభుత్వం పన్నులు పెంచుతూ పోతుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు డేంజర్ సిగ్నల్స్ పంపుతుంది
కర్ణాటకలో వరసగా ప్రభుత్వం పన్నులు పెంచుతూ పోతుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు డేంజర్ సిగ్నల్స్ పంపుతుంది. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత తమ ఖజానాను నింపుకునేందుకు అనేక రకాలుగా పన్నులు పెంచుతూ వస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆ మాత్రం పన్నులు పెంచకపోతే రాబడి ఎక్కడి నుంచి వస్తుందని కర్ణాటక పాలకులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా, ఇచ్చిన హామీలను ప్రజలకు అందించాలన్నా ఖచ్చితంగా ప్రజలపై భారం మోపాల్సిందేనన్నది కన్నడ పాలకుల వాదన. ఇందుకు సహకరించాలని కూడా ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం కోరుతుంది.
ఐదు గ్యారంటీలు ఇచ్చి...
కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వీటిని అమలు చేయాలంటే ఎడా పెడా పన్నులను పెంచుతూ పోతుంది. తాజాగా పెట్రోలు, డీజిల్ పై అమ్మకపు పన్ను ను పెంచింది. పెట్రోలు ధరపై మూడు రూపాయలు, డీజిల్ ధరపై లీటరకు 3.02 రూపాయలు పెంచుతూ కర్ణాటక సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పెంచిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. దీనివల్ల ఖజానాకు 2,800 కోట్ల రాబడి సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉచిత విద్యుత్తును అమలు చేయడానిక విద్యుత్తు ఛార్జీలను పెంచింది. మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచింది. దేశీయ లిక్కర్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ 20 శాతాన్ని పెంచారు. ఇక ఆదాయం వచ్చే అన్ని మార్గాలను వెతుక్కుంటూ కన్నడ సర్కార్ ధరలను పెంచుతూ వెళుతుంది.
ఆరు గ్యారంటీలతో...
ఇప్పుడు తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రజలపై భారం మోపక తప్పని పరిస్థితి అంటున్నారు ఆర్థిక నిపుణులు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. వీటిని అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇక మద్యం ధరలను పెంచుతారన్న ప్రచారం జరుగుతుంది. అలాగే ఆదాయం పెరిగే మార్గాలపై ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అందులో ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ వంటి శాఖల అధికారులు ఉన్నారు. దీంతో ఇక్కడ కూడా ఆ శాఖలకు సంబంధించిన క్రయ విక్రయాల్లో పన్నులు పెంచే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే స్థానిక సంస్థలు ఉండటంతో ఇప్పుడు చేస్తారా? తర్వాత చేస్తారా? అన్నది తెలియదు కానీ.. పన్నులు పెంచడమయితే గ్యారంటీ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సూపర్ సిక్స్ తో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు అతీతం కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ తో సక్సెస్ సాధించింది. ప్రజలు కూటమికి పట్టం కట్టారు. అయితే ఏపీలో ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలేదు. కానీ రానున్న రోజుల్లో కొన్ని ధరలు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు ఉన్నతాధికారులు. ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా ప్రజలపై భారం మోపాల్సిందే. అంతే తప్ప ఇప్పటికిప్పుడు సంపద సృష్టి సాధ్యం కాదు. అయితే కర్ణాటక, తెలంగాణ కంటే ఏపీకి ఒక విషయంలో అనుకూలత ఉంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవచ్చు. కానీ ఏపీలో టీడీపీ వల్లనే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తుండటంతో కేంద్ర సహకారం లభిస్తుందని ఇప్పుడిప్పుడే పన్నుల భారం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో ముందు ముందు ఎన్నెన్ని రకాల పన్నులు వేస్తారో? ఏమేమి నిర్ణయాలు వెలువడుతాయోనన్న భయం ఇప్పుడు ప్రజలకు పట్టుకుంది.
Next Story