Sun Mar 16 2025 23:58:20 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఈ కొత్తోళ్లున్నారే.. వీరు పార్టీకి ఎంతవరకూ ఉపయోగం?
తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు రాజకీయంగా దాదాపు స్వస్తి చెప్పినట్లే. నారా లోకేష్ శకం పార్టీలో ప్రారంభమయిందనే అనుకోవాలి

తెలుగుదేశం పార్టీలో ఇక సీనియర్లకు రాజకీయంగా దాదాపు స్వస్తి చెప్పినట్లే. నారా లోకేష్ శకం పార్టీలో ప్రారంభమయిందనే అనుకోవాలి. పార్టీ పదవుల్లోనూ, త్వరలో భర్తీ అయ్యే నామినేటెడ్ పోస్టుల్లోనూ యువతరానికే ప్రాధాన్యత ఇవ్వాలని నారా లోకేష్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ ఫేస్ ను గ్లామర్ ను పూర్తిగా మార్చి వేయాలని, ముసిలి కంపును వదిలించుకోవాలన్న నిర్ణయానికి లోకేష్ వచ్చారని అంటున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే లోకేష్ పార్టీపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తనకంటూ ఒకవర్గాన్ని ఇప్పటి నుంచే క్రియేట్ చేసుకుంటున్నారు. లోకేష్ వర్గం ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తుందన్న వాదనలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
యువగళం పాదయాత్ర నుంచే..
నారా లోకేష్ ఇప్పటి నుంచే కాదు.. దాదాపు పదేళ్ల నుంచి పార్టీలో వెనక ఉండి కొన్నాళ్లు.. ప్రత్యక్షంగా 2014 తర్వాత పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పాత ముఖాలతో ప్రజలు విసిగిపోయి ఉండటంతో సీనియర్ నేతలను ఆదరించరన్న నమ్మకంతో లోకేష్ టీం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా దాదాపు అదే అభిప్రాయంలో ఉన్నారు. అందుకే టీం మొత్తాన్ని మార్చే పనిలో ఉన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర నుంచే చురుకైన నేతలను ఎంపిక చేసుకున్నారు. వారితోనే నియోజకవర్గంలో పార్టీ పనులు కానిచ్చేస్తున్నారని వినికిడి. సీనియర్ నేతలు మరొకరిని ఎదగనివ్వకపోవడంతో కొంత తెలుగు యువతలో అసంతృప్తి ఉందని భావించిన లోకేష్ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
నాలుగు దశాబ్దాల నుంచి...
నిజమే.. నాలుగు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలో అవే ముఖాలు. ఎప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా వారే మంత్రులు. వారే జిల్లా పార్టీ అధ్యక్షులు. అధికారంలోకి రాకపోయినా వారి కనుసన్నల్లోనే జిల్లా పార్టీ నడవాల్సిందే. అందుకే మర్రి చెట్టు కింద మరొకటి ఎదగనివ్వదన్నట్లు పార్టీలో పరిస్థితి తయారయింది. అయితే జనరేషన్ లు మారుతున్నా కొత్తతరానికి ఛాన్స్ లు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లుతుంది. వారు వారు కాకుంటే వారి వారసులకు మాత్రమే ఎమ్మెల్యే సీటు అయినా.. మంత్రి పదవి అయినా.. చివరకు పార్టీ పదవి అయినా. అందుకే కొత్త నాయకత్వం ఎదగలేకపోతుందన్న విమర్శలు కొంత కాలం నుంచి వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల నుంచి కొంత మార్పును పార్టీ నాయకత్వం చేపట్టింది. పార్టీని ప్రక్షాళన చేసే విధంగా చర్యలకు పూనుకుంది. సీనియర్ నేతలను పక్కన పెట్టడానికి సిద్ధపడింది.
మంత్రివర్గం నుంచే...
మంత్రి వర్గంలోనూ లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. వారయితేనే చెప్పినట్లు వింటమే కాకుండా పార్టీకి లాయల్ గా ఉంటారని చంద్రబాబు సయితం భావిస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్లను వదిలించుకోవడానికి సిద్ధమయ్యారు. క్రమంగా పాత వాసనలను పారదోలి కొత్త సువాసనలను రప్పించాలన్న యోచనలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఇది నేతల్లో ముఖ్యంగా వచ్చే జనరేషన్ కు పార్టీ పట్ల మొగ్గు చూపడానికి దారి చూపుతుందని భావిస్తున్నారు. సీనియర్ నేతలను పార్టీ సేవలకు పరోక్షంగా ఉపయోగించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో.. ఇక అంతా లోకేష్ మాత్రమే సైకిల్ సవారీ చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలను చూసుకుంటుంటే లోకేఏష్ మాత్రం పార్టీని మరింత పటిష్టమైన దిశగా వెళ్లేందుకు చర్యలు ప్రారంభించారర.
Next Story