Wed Apr 23 2025 03:02:28 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : వ్యూహం బెడిసి కొడుతుందా? గ్రౌండ్ లో గ్రిప్ మళ్లీ పెరుగుతుందా?
గత ఎన్నికల్లో వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి. జగన్ పార్టీపై జనంలో ఎంత అసంతృప్తి ఉందో ఇట్టే అర్థమవుతుంది.

గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే జగన్ పార్టీపై జనంలో ఎంత అసంతృప్తి ఉందో ఇట్టే అర్థమవుతుంది. జగన్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ గత ఎన్నికల్లో చివరకు జగన్ సొంత సామాజికవర్గమైన రెడ్డి సామాజికవర్గం కూడా దూరమయింది. దీనికి అనేక కారణాలున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఎస్సీలు.. నా బీసీలు.. నా ఎస్టీలు.. నా మైనారిటీలు అంటూ నినాదం ఎత్తుకుని తనను అందలం ఎక్కించిన సొంత సామాజికవర్గాన్ని విస్మరించారన్న విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. కాంట్రాక్టులు, పదవుల పంపకాల్లోనూ వారిని పక్కన పెట్టడంతో ద్వితీయ శ్రేణి నేతలందరూ జగన్ కు గత ఎన్నికల్లో దూరమయ్యారు.
జగన్ చేజేతులా...
గ్రామాల్లో బలంగా ఉన్న ఒక సామాజికవర్గం దూరమవ్వడానికి జగన్ చేజేతులా చేసుకున్నదేనని అందరూ అంగీకరించే విషయమే. మనోడయినా.. మనకు ఉపయోగపడనప్పుడు ఎందుకంటూ అనేక మంది బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పనిచేసేది..కష్టపడేది.. జేబుల చిలుం వదిలించుకునేది తామయితే అధికారంలోకి రాగానే తమను దూరం పెట్టి తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారని కూడా విమర్శలు రెడ్డి సామాజికవర్గం నుంచి బలంగా వినిపించాయి. ఎంతలా అంటే కనీసం కాంట్రాక్టు బిల్లులు కూడా తమకు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని, చంద్రబాబు సర్కార్ లోనే తమకు న్యాయం జరిగిందని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడే అనేక మంది ఆ సామాజికవర్గం నేతలు దూరమయ్యారు.
రాయలసీమలో పూర్తిగా...
పోలింగ్ బూత్ లవద్ద పట్టించుకోలేదు. ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. జనాన్ని పోగేసుకోవడానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో జగన్ కు పట్టున్న రాయలసీమ జిల్లాల్లోనూ వైసీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేశారంటే అది రెడ్లు కొట్టిన దెబ్బేనని జగన్ కూడా అంగీకరిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఏ నేత పనిచేయకపోవడం వల్లనే కడప జిల్లాలో కూడా మూడు సీట్లు మాత్రమే దక్కాయన్నది కాదనలేని వాస్తవం. కడప, కర్నలూ, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రాజకీయాలను రెడ్డి సామాజికవర్గం శాసిస్తుంది. అటువంటి చోటనే గత ఎన్నికల్లో పట్టుతప్పడం జగన్ పై ఆ సామాజికవర్గం ఆగ్రహమే కారణమని చెప్పకతప్పదు.
మళ్లీ సాఫ్ట్ కార్నర్
అయితే తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసి జగన్ పై ఒకింత సాఫ్ట్ కార్నర్ మళ్లీ మొదలయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును ఇన్ని కష్టాలు పెడుతున్నారంటూ కొందరు తిరిగి యాక్టివ్ అవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. జగన్ ను అధికారంలోకి తేలేకపోతే తాము ఇక జీవితంలో రాలేమన్న భావన రెడ్లలో బాగా పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు తిరిగి పార్టీ జెండాలను పట్టుకునేందుకు సిద్ధమయ్యారంటున్నారు. కష్ట సమయంలో అండగా ఉండేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ జగన్ వైఖరిలో ఈసారైనా మార్పు వస్తుందా? రాదా? అన్న భయం మాత్రం వారిలో అక్కడక్కడా కనిపిస్తుందంటున్నారు. వరసగా పార్టీ నేతలను వీడిపోయేలా చేయడంలో ప్రత్యర్థులు సక్సెస్ కావచ్చు కాని గ్రౌండ్ లో గ్రిప్ తిరిగి పెంచుకుంటామన్న ధీమా వైసీపీ నేతల్లో కనిపిస్తుంది.
Next Story