Tue Nov 05 2024 16:29:18 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో కీలక నిర్ణయం.. పలు విమాన సర్వీసులు రద్దు
వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులు పునరుద్ధరిస్తామని ఇండిగో తెలిపింది. తుపాను దృష్ట్యా ఇవాళ విశాఖ నుంచి అన్ని విమాన..
విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తీవ్ర తుపాను బలహీనపడి.. మచిలీపట్నంకు 50 కిలోమీటర్ల దూరంలో తుపానుగా కేంద్రీకృతమైంది. తుపాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అసని తుపాన్ కారణంగా పలు ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు రద్దు చేయడంతోపాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింక్ సర్వీసులు సైతం తుపాన్ కారణంగా నిలిపివేసింది.
వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులు పునరుద్ధరిస్తామని ఇండిగో తెలిపింది. తుపాను దృష్ట్యా ఇవాళ విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు చేయడంతోపాటు రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి 9 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. అసని తుపాన్ కారణంగా ఇప్పటికే 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే పలు రైళ్ల రద్దు అయ్యాయి. విమానాలు, రైళ్లను వాతావరణం అనుకూలంగా మారిన తరువాత పునరుద్ధరిస్తామని ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రయాణికుల సేఫ్టీతోపాటు సంస్థలు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. అసని తుపాన్ ఎంత నష్టం మిగులుస్తుందో వేచి చూడాల్సిందే.
Next Story