Mon Dec 23 2024 09:54:21 GMT+0000 (Coordinated Universal Time)
పెట్టుబడులకు నిలయంగా ఆంధ్రప్రదేశ్.. ఇండస్ట్రియల్ కారిడార్లలో శరవేగంగా పనులు
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా చర్యలు చేపడుతూ ఉంది. కొత్త పెట్టుబడులను తీసుకుని వచ్చి రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోడానికి కారణం అవుతూ ఉంది. రాష్ట్రంలో కొత్త కొత్త ప్రాజెక్టులు, కారిడార్లు రాష్ట్రానికి రావడంతో అటు ఆదాయం.. ఇటు ఉపాధి కూడా భారీగా పెరిగింది. విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతూ ఉండడం రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చనుంది. మూడు కారిడార్లు 25,000 ఎకరాలకు పైగా విస్తరించాయి. రూ. 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తాయి. అలాగే 2040 నాటికి 5.5 లక్షల మందికి ఉపాధిని కల్పించనున్నాయి.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణంపై దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం నుంచి ఇప్పటికే విశాఖ-చెన్నై కారిడార్, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లు రాష్ట్రం మీదుగా వెళుతున్నాయి. దీంతో మూడు పారిశ్రామిక కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ కారిడార్లలో మొత్తం 8 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. విశాఖ-చెన్నై కారిడార్ను ఏడీబీ(ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) రుణ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. తొలిదశలో విశాఖలో అచ్యుతాపురం-రాంబిల్లి, నక్కపల్లి క్లస్టర్లు, చిత్తూరు జిల్లాలో ఏర్పేడు-శ్రీకాళహస్తి క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి పెద్ద సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకే మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు ఏపీ అధికారులు తెలిపారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాల వారీగా క్లస్టర్లను అభిృవృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పారిశ్రామిక పార్కుల పనులను శరవేగంగా పూర్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.
Next Story