Sat Nov 23 2024 02:36:50 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జగన్ తరహాలోనే చంద్రబాబు ఎంతసేపూ విమర్శలేనా? విషయం లేదా?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తుంది. జగన్ పై విమర్శలు చేయడం తప్ప చేసింది శూన్యమంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తుంది. అయితే ఇప్పటి వరకూ అధికార పార్జీ నాటి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప చేసింది శూన్యమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జనం ఆశిచింది వేరు.. జరుగుతుంది వేరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ఆ పార్టీకి కేవలం పదకొండు సీట్లను అప్పగించి మిగిలిన సీట్లన్నీ గంపగుత్తగా కూటమికి ఇచ్చేశారు. ఏపీ చరిత్రలో ఇది అద్భుతమైన అంకె అనే చెప్పాలి. దాదాపు వన్ సైడ్ పోలింగ్ జరిగిందనే అనుకోవాలి.
భారీ విజయాన్ని...
అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఉదయం లేచిన దగ్గర నుంచి గత ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ప్రజలకు ఏంచేయాలో ఆలోచించకుండా ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడానికి, కోలుకోకుండా చేయడానికే కూటమి పార్టీల అధినేతలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు అనేక విషయాలపై చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేయగలిగారు తప్పించి కేంద్రంలో అధికార పార్టీ నుంచి నిధులు తెచ్చేందుకు ఎంత మాత్రం ప్రయత్నించడం లేదన్న విమర్శలున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో కాలయాపన చేయడం తప్ప సొంత సామాజికవర్గానికి కూడా మేలు చేసిందేమీ లేదన్న పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.
జగన్ కూడా అంతేగా...
గతంలో జగన్ కూడా ఇదే తరహా పాలన కొనసాగించారు. నాడు బటన్ నొక్కడమే తన పని అని భావించిన జగన్ టీడీపీ, జనసేన లక్ష్యంగా విమర్శలు చేస్తూ వెళ్లారు. అభివృద్ధిని పక్కన పెట్టారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ప్రజలు మాత్రం జగన్ కు ఓటేయక పోవడానికి కారణం ప్రధానంగా కక్ష సాధింపు చర్యలేనన్న బలమైన విశ్లేషణ వినపడుతుంది. చంద్రబాబును జైల్లో వేయడం దగ్గర నుంచి పవన్ కల్యాణ్ ను అనేక సార్లు అడ్డుకోవడం కూడా వైసీపీ ఓటమికి కారణాలుగా చెప్పాలి. అందుకే జగన్ ప్రభుత్వానికి ఏపీ ప్రజలు గుడ్ బై చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని స్వాగతించారు. కానీ చంద్రబాబు కూడా సేమ్ టు సేమ్ దారిలో పయనిస్తున్నట్లే కనిపిస్తుంది.
పింఛన్లు తప్ప...
వచ్చిన తర్వాత పింఛను తప్ప ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏమీ అమలు చేయలేకపోతున్నారన్న విమర్శలు గ్రౌండ్ లెవెల్లో సౌండ్ రేపుతున్నాయి. తమకు వచ్చే ఏ పథకం కూడా అందకుండా పోయిందని లబ్దిదారుల్లో ఆందోళన మొదలయింది. ఏ వర్గంలోనూ సంతృప్తి కనిపించడం లేదు. దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెబుతున్నప్పటికీ, గతంలో తమ బ్యాంకు ఖాతాల్లో పడుతున్నట్లుగా నగదు పడకపోవడంతో కొంత అసంతృప్తి అయితే బయలుదేరిందనే చెప్పాలి. జగన్ చేసిన తప్పులపై విచారించవచ్చు. అవసరమైతే చట్టపరంగా శిక్షించవచ్చు. కానీ అంతకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా వెంట వెంటనే అమలు పర్చి విశ్వాసం కాపాడుకోవాలన్న కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయి. మరి ఇదే రకంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తారో? లేక మిగిలిన అంశాలపై దృష్టి పెడతారన్నది చూడాల్సి ఉంది.
Next Story