Tue Apr 08 2025 06:19:53 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus for Women : బస్సు బయలుదేరుతుందా? లేదా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందో అర్ధం కాకుండా ఉంది

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందో అర్ధం కాకుండా ఉంది. అసలు ఈ పథకాన్ని ప్రారంభించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా? లేదా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులో వివిధ రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు బస్సుబయలుదేరడానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే మంత్రుల దగ్గర నుంచి అనేక మంది టీడీపీ నేతలు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఉగాదికి అనుకంటే అది కూడా వెళ్లిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలోనైనా దీనిపై నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జరుగుతుంది.
సాఫీగా సాగాలనే...
గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీని అయితే ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కానీ పది నెలలు గడుస్తున్నా అతి సులువుగా అమలు చేసే ఈ పథకాన్ని అమలు చేయకపోవడం పై ముఖ్యంగా మహిళల్లో అసంతృప్తిని రాజేస్తుంది. పథకం అమలు చేసినా సాఫీగా సాగాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుచేయడం లేదని అంటున్నారు.అన్ని విషయాల్లో పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత నిదానంగానే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చిన మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించి నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేదు.
కొంతక్లారిటీ ఇచ్చినా...
జిల్లాల వరకే ఉచిత ప్రయాణమన్నక్లారిటీని ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. దీనివల్ల ఆర్టీసీపై పెద్దగా భారం పడబోదని, కేవలం విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో మాత్రమే కొంత ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుందన్న అంచనాల్లో ప్రభుత్వం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని ముందస్తు చర్యలు తీసుకుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని ప్రభుత్వంలోని పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులో జాప్యం అవుతుందని చెబుతున్నారు. ఒకసారి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమయితే దానిని పూర్తి కాలం కొనసాగించాలని, అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ఆలస్యంగానైనా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story