Fri Nov 15 2024 07:05:42 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... కేంద్రం ఆదుకుంటుందా? చేతులెత్తేస్తుందా?
. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే అనేక విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే రకమైన ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే అనేక విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. పదేళ్లయినా అవి ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికి రెండుసార్లు కేంద్రంలో మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. అయినా అరకొర సాయమే అందించిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అప్పులు ఇవ్వడం తప్ప సాయం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి జరగడం లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత రెండు దఫాల లెక్క వేరు. ఈసారి అయినా కేంద్ర అరకొర నిధులు విదిల్చి ఏపీని నట్టేట ముంచుతారా? లేక ఆదుకుంటారా? అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.
డిమాండ్ చేసే శక్తి....
2014లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. అయితే అప్పుడు కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. డిమాండ్ చేసేంత శక్తి అప్పటి రాష్ట్ర ప్రభుత్వమైన టీడీపీ కూటమికి లేకుండా పోయింది. అందుకే విభజన హామీల్లో ముఖ్యమైన ప్రత్యేక ప్యాకేజీకి కూడా ఎగనామం పెట్టేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నా అది కూడా సక్రమంగా ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు కూటమి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అయితే కేంద్రంలో ఒంటరిగానే బీజేపీ అధికారంలోకి రావడంతో ఏపీ గురించి అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు.
కేంద్రానికి మద్దతు...
ఇప్పుడు వేరు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు అత్యవసరం. అలాగే ప్రతిపక్ష వైసీపీ సపోర్టు కూడా రాజ్యసభలో అవసరమవుతుంది. ఏపీతో కేంద్రానికి అవసరం ఉంది. కానీ ఈ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి అనుకున్న స్థాయిలో సాయం చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఏపీకి కూడా కొన్ని పథకాల పేరిట నిధులు పంపిణీ చేస్తున్నారు తప్పించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది.
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు?
ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో మన నేతలు ఏపీకి వీలయినంత మేర ఎక్కువ సాయం పొందేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడ కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్ వెన్నంటి ఉండాలి. అది వాళ్ల అవసరం. ఆ అవసరాన్ని ఏపీ నేతలు ఉపయోగించుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి నిధులతో పాటు విభజన హామీలను కూడా అమలు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అలా కాకుండా రాష్ట్ర రాజకీయాలకే పెద్దపీట వేసి కూర్చుంటే ఐదేళ్లు గడిచిపోతాయి. ఏపీ పరిస్థితి ఏమాత్రం బాగుపడదన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.
Next Story