Tue Nov 19 2024 05:43:52 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఏపీలో కొత్త రూల్స్.. అతిక్రమిస్తే అంతే
ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కఠిన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో.. బాధిత దేశాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటు భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించగా.. తాజాగా ఏపీ సర్కార్ కూడా ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర హోంశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను మరోసారి కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
మాస్క్ ధరించకుంటే?
నేటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఇకపై పబ్లిక్ ప్రాంతాల్లో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి మాస్కులు లేనివారిని అనుమతిస్తే.. సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేలకు జరిమానా విధించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వ్యాపార, వాణిజ్య సంస్థలను రెండ్రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే....
రాష్ట్రంలో ఎక్కడైనా దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ఉల్లంఘనలు జరిగితే ప్రజలు 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా కంప్లెంట్ చేయవచ్చని ఉత్తర్వుల్లో సూచించింది ఏపీ ప్రభుత్వం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రూల్స్ ను అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Next Story