Sun Dec 22 2024 18:43:56 GMT+0000 (Coordinated Universal Time)
12న జగనన్న విద్యాకానుక, 20న జగనన్న ఆణిముత్యాలు
నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. జగనన్న విద్యాకానుక..
ఏపీలో జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. స్కూల్స్ రీ ఓపెన్ అయిన రోజునే 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను అందించనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. జగనన్న విద్యాకానుక పేరుతో విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జగనన్న విద్యాకానుకకు రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
జూన్ 12 సోమవారం నాడు పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, విద్యార్థులకు విద్యాకానుకను అందజేస్తారన్నారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు
20న జగనన్న ఆణిముత్యాలు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించే వేడుక రాష్ట్రస్థాయిలో 20న సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, హెచ్ఎంలనూ సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో విద్యార్థులను సత్కరిస్తామన్నారు. వీరితో పాటు టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులను 12 నుంచి 19 వరకు సత్కరించనున్నట్లు తెలిపారు. మొత్తం 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందిస్తామన్నారు.
Next Story