Pawan Kalyan : పవన్ కల్యాణ్ అందరి ఆశలపై నీళ్లు చల్లారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను అభిమానించే అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనను అభిమానించే అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన ఆకాంక్షించడంతో అందరిలో ఆయన పలుచన అయ్యారు. పవన్ కల్యాణ్ ను ఒక హీరోగా లక్షలాది మంది ఆరాధిస్తారు. అదే సమయంలో తమ సామాజికవర్గానికి చెందిన నేతగా కోట్లాది మంది అభిమానిస్తారు. గత ఎన్నికల్లో కాపులందరూ ఐక్యంగా నిలిచి ఓట్లు వేసింది పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఆయన ఉన్నత స్థానాన్ని అధిష్టించాలన్న ఆకాంక్షతోనే.
కాపు సామాజికవర్గంలోనూ…
విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజిత ఏపీలోనూ కాపు సామాజికవర్గం నేతలు ఎవరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ లోటును పూడ్చేందుకు పవన్ వచ్చారని కాపులందరూ మొన్నటి ఎన్నికల్లో ఏకమై పూనకాలు పూనడంతో ఓట్లు వేశారు. అయితే ఆయన చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తుతూ మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆకాంక్షించడం ఎంత వరకూ సబబమంటూ అనేక మంది సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.
ఫ్యాన్స్ సయితం…
పవన్ ను ఆరాధించే అభిమానులు సయితం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే వారి ఆకాంక్ష. కేవలం స్క్రీన్ పైనే కాదు..రాజకీయంగా కూడా ఆయనను హీరోగానే చూడాలనుకుంటారు. పవన్ దే పై చేయి ఉండాలనుకునే వీరాభిమానులున్నారు. ముఖ్యమంత్రి అవుతారనే గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు ఫ్యాన్స్ అంటే యువకులు క్యూకట్టి మరీ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేశారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించి వంద శాతం స్ట్రయిక్ రేటుతో విజయాన్ని అందించగలిగారు.
పవర్ లోకి వచ్చిన తర్వాత…
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ ఇటు జనసైనికులను, అటు కాపు సామాజికవర్గాన్ని విస్మరించారన్న విమర్శలు వినపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశంసించడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా వారికి మింగుడుపడటం లేదు. పవన్ శాసించే వ్యక్తిగా ఉండాలనుకున్నారు కానీ, యాచించే వ్యక్తిగా కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటు అభిమానులు, అటు సొంత సామాజిక వర్గ ఆంకాంక్షను కాదని మరో పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుని పవన్ పెద్ద తప్పుచేశారంటూ వారు వాపోతున్నారు. పవన్ కల్యాణ్ కు ఇది భవిష్యత్ లో పెద్దయెత్తున డ్యామేజీ చేసే అవకాశాలు మాత్రం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.