Thu Dec 26 2024 13:26:41 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ ను కట్టడి చేయడం ఎలా? టీడీపీలో హాట్ టాపిక్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు తరహాలోనే మళ్లీ ఆవేశంతో ఉన్నారు. టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు తరహాలోనే మళ్లీ ఆవేశంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఒకింత నాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ ప్రతి సభలో శపథం చేశారు. జగన్ ను అథ:పాతాళానికి తొక్కేస్తానని ప్రకటించి సంచలనమే సృష్టించారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని ప్రతిన బూనారు. అన్నట్లుగానే కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. నిజానికి పవన్ కల్యాణ్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. పవన్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు కాపు + కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా బలంగా పనిచేసింది. చంద్రబాబును జైల్లో వేసిన సానుభూతి కూడా కొంత పనిచేసింది.
పవన్ అనుకున్నట్లుగానే...
పవన్ కల్యాణ్ అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల పాలన పూర్తయింది. వంద రోజుల్లో పవన్ అసలు రాజకీయాల జోలికి రాలేదు. ఆయన తనకు అప్పగించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై దృష్టి పెట్టారు. తొలిసారిగా ఉపముఖ్యమంత్రిగా కూడా కావడంతో పవన్ కల్యాణ్ తనకు అప్పగించిన శాఖలపై కూలకషంగా అధ్యయనం చేయడానికి సమయాన్ని ఎక్కువ సేపు వెచ్చించారు. మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి గ్రామాభివృద్ధిపైనే పవన్ కల్యాణ్ మూడు నెలల పాటు ఫోకస్ పెట్టారు. దీంతో తనకు అప్పగించిన శాఖలపై పవన్ కల్యాణ్ కు కొంత వరకూ గ్రిప్ దొరికినట్లయింది.
వంద రోజులు ముగిసే వరకూ...
అయితే వందరోజుల పాలన ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదంలో ఆగ్రహంతో ఊగిపోయారు. తిరిగి ఎన్నికల నాటి పవన్ కల్యాణ్ అందరికీ కనిపించారు. సనాతన ధర్మంపై ఎక్కువగా మాట్లాడారు. హిందువులంతా ఏకంకండి..తిరుమల లడ్డూ వివాదంలో అందరూ రోడ్డుపైకి రావాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూపై కామెంట్స్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టాలీవుడ్ నుంచి రాజకీయ నేతల వరకూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అందరికీ తాట తీస్తానంటూ హెచ్చరించారు. దీనికితోడు తిరుమలలో అపవిత్రం జరిగిందని ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. వచ్చే నెల 1వ తేదీన తిరుమలకు వెళ్లి దీక్షను విరమించనున్నారు. అయితే తాజాగా జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని జనసేనాని పిలుపు నివ్వడం వెనక టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు.
సనాతన ధర్మమంటూ...
కానీ పవన్ కల్యాణ్ పూర్తిగా హిందూ ధర్మాన్ని భుజనికెత్తుకోవడం కూటమిలోని బీజేపీకి కొంత బాగానే ఉన్నప్పటికీ, టీడీపీ మాత్రం ఇరకాటంలో పడినట్లయింది. మిగిలిన వర్గాలు కూటమికి దూరమవుతాయన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతుంది. అయితే పవన్ను అభ్యంతరం పెట్టే సాహసం టీడీపీనేతలు ఎవరూ చేయలేరు. అందుకు కారణం.. చంద్రబాబు,పవన్ల మధ్య బంధం బలమైనదిగా మారడంతో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే పార్టీలో మాత్రం పవన్ కల్యాణ్ ఆవేశపూరిత ప్రకటనలపై మాత్రం చర్చ బాగానే జరుగుతుందని తెలిసింది. ప్రధానంగా మైనారిటీలు, దళితులు తమకు దూరమవుతారేమోనన్న ఆందోళనను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ ను కంట్రోల్ చేయలేరెవరు. అది అందరికీ తెలిసిందే. పవన్ రానున్న కాలంలో ఎలాంటి రకమైన కామెంట్స్ చేసి కూటమిని ఇరుకున పెడతారేమోనన్న భయం సైకిల్ పార్టీ నేతలకు పట్టుకుంది. మరి పవన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story