Mon Dec 23 2024 20:08:44 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వ్యూహం మొదలు పెట్టారా? ఇక దబిడి దిబిడేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనపడుతుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనపడుతుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఏపీ పాలిటిక్స్ ను తన చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకూ అధికారానికి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవలే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలను చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన మిత్రపక్షాలతో సయోధ్యతతో సాగుతున్నారు. తాను నొప్పించక.. ఎవరినీ ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఎన్నికలకు ముందు దూకుడుగా ఉన్న పవన్ కల్యాణ్ తర్వాత చాలా వరకూ నెమ్మదించారు. ప్రశాంతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి స్పష్టమవుతుంది.
పదేళ్ల నుంచి...
2014లో జననసేన ఏర్పడిన నాటి నుంచి పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు. అందులో 2014 ఎన్నికల్లో తాను పోటీచేయకపోయినా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చినప్పటికీ ఆయన బలం ఏంటో ప్రత్యర్థులకు తెలిసి రాలేదు. బలం, బలంగం తనకు పుష్కలంగా ఉందని నిరూపించుకుందామని 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాలతో పాటు ఒక్కటి మినహా అన్ని స్థానాల్లో జనసేన ఓడి పోవడంతో అనేక మంది పార్టీని వీడిపోయారు. అందుకే పవన్ కల్యాణ్ ఎవరినీ నమ్మలేదు. దగ్గరకు కూడా రానివ్వలేదంటారు.
కూటమి ఏర్పాటులో...
కానీ 2024 ఎన్నికల్లో తాను వ్యూహంతో వెళుతున్నానని చెప్పి మరీ పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిపి కూటమిని కట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. పవన్ కల్యాణ్ వల్లనే కూటమి ఏర్పాటు సాధ్యమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు సయితం అంగీకరించారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేనను గెలిపించుకున్నారు. శపథం చేసినట్లుగానే జగన్ ను అధికారం నుంచి దించగలిగారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కీలకమైన శాఖలను ఎంచుకుని మరీ తాను తీసుకున్నారు. మంత్రి పదవుల కోసం పెద్దగా పట్టుబట్టకుండా పట్టువిడుపులు ప్రదర్శించారు. దీంతో పవన్ స్ట్రాటజీ ఏంటో జనసైనికులకు అర్థం కాకుండా పోయింది.
చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి...
అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. గతంలో చేరికలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పవన్ ఇప్పుడు మాత్రం వాటిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. ముఖ్యమైన ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో నేతలను పార్టీలోకి తీసుకుంటూ భవిష్యత్‌లో మరింతగా పార్టీని విస్తరించాలన్న వ్యూహంతో ఆయన వెళుతున్నట్లు కనపడుతుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, సామినేని ఉదయభానుల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. తమ కుటుంబం కొన్నాళ్ల పాటు ఉన్న ఒంగోలులోనూ, పట్టులేని కృష్ణా జిల్లాలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు నేతల చేరికకు పవన్ కల్యాణ్ ఓకే చెప్పారని తెలిసింది. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినా, భవిష్యత్ లో రావన్న గ్యారంటీ లేదు. అందుకే ముందు చూపుతో ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారన్న టాక్ గాజుగ్లాసు పార్టీలో ఓపెన్ టాక్ అయింది.
Next Story