Sat Dec 21 2024 15:47:55 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ మళ్లీ ఎఫెన్స్లోకి వచ్చినట్లే.. అసలు రీజన్ ఇదేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలకు ముందు తరహా రాజకీయాలను ప్రారంభించినట్లే కనపడుతుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలకు ముందు తరహా రాజకీయాలను ప్రారంభించినట్లే కనపడుతుంది. ఫుల్లు ఎఫెన్స్ లో కనపడుతున్నారు. నిన్నటి వరకూ తన పని ఏదో తాను చూసుకుంటూ పవన్ కల్యాణ్ పెద్దగా బయటకు కనిపించలేదు. ఆయన తనకు కేటాయించిన శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలను ఆయన పూర్తిగా అధ్యయనం చేశారు. అధికారులతో సమీక్షలు, ఉత్తర్వులకే పరిమితమైన పవన్ కల్యాణ్ నేడు గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. వచ్చీ రావడంతోనే ఇటు కూటమి ప్రభుత్వంపైనా, అటు విపక్షంపైనా విరుచుకుపడుతూ వెళ్లడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతుంది.
పిఠాపురం నియోజకవర్గంలో...
నిన్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో ఉంటున్న టీడీపీ నేత చేతిలో ఉన్న హోంశాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖను సరిగా నిర్వహించడంలేదంటూ మండిపడ్డారు. వంగలపూడి అనిత నుంచి తాను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూటమి పార్టీల నేతల వరకూ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఏకిపారేశారు. నిజానికి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై అసంతృప్తి ఉంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేరుగా చెప్పవచ్చు. లేదంటే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించవచ్చు. కానీ పవన్ అలా చేయలేదు. జనం సమక్షంలో హాట్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు కూటమిలో ఏదో జరుగుతుందన్న అనుమానాలను లేవనెత్తారు.
జగన్ కంపెనీ వద్దకు చేరుకుని...
ఇక పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించాల్సి ఉన్నప్పటికీ మరుసటి రోజు పల్నాడు ప్రాంతానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించిన సరస్వతీ పవర్ భూములను సందర్శించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అన్యాక్రాంతమైన భూముల విషయాలను పవన్ ప్రస్తావించారు. పేదల భూములను జగన్ బలంవంతంగా సొంతం చేసుకున్నారంటూ మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత ఈ కంపెనీకి భూముల లీజును యాభై ఏళ్ల పాటు పొడిగించుకున్నారన్నారు. కోడెల శివప్రసాద్ ను ఫర్నిచర్ కోసం వేధించి నాటి ప్రభుత్వం చంపేసిందంటూ పల్నాడు పర్యటనలో వ్యాఖ్యానించారు. భూములు లాక్కున్న వారికి సరస్వతీ పవర్స్ లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ రైతుల వద్ద ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీ నుంచి ఏదైనా?
డిప్యూటీ చీఫ్ మినస్టర్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఇలా ఆవేశంగా మాట్లాడటం.. తన, తరతమ బేధల్లేకుండా మాట్లాడుతుండటం రాజకీయంగా చర్చకు దారితీసింది. అసలు పవన్ కల్యాణ్ మనస్సులో ఏముందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. 2027 నాటికి తాను కీలకంగా మారాలని పవన్ భావిస్తున్నారా? అన్న అనుమానం మాత్రం కూటమి పార్టీల్లోనూ బయలుదేరింది. ఢిల్లీ నుంచి ఏదైనా సిగ్నల్స్ అందాయా? అన్న చర్చకూడా ఏపీ పాలిటిక్స్ లో జరుగుతుంది. పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు మౌనంగా ఉండి, చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించి కొంచెం ఇమేజ్ తగ్గడంతో తిరిగి దానిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. మొత్తం మీద గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్, పర్యటిస్తున్న తీరు అనేక అంశాలకు చర్చనీయాంశంగా మారింది.
Next Story