Sun Nov 17 2024 08:45:31 GMT+0000 (Coordinated Universal Time)
రోజులు మారాయి.. మాటలతో మోసం చేయలేము: పవన్ కళ్యాణ్
నర్సాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయ పోరాటంలో తన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదన్నారు. పులివెందుల నుంచి కొందరు నర్సాపురం ఆక్వా వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారని పవన్ అన్నారు. అవినీతి, దోపిడీయే లక్ష్యంగా కొందరు నేతలు పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే సమాజంలో మార్పురాదని.. ఆ బాధ్యతను జనసేన తీసుకుందని పవన్ చెప్పారు. కనీస వసతులు అందరికీ అందాలని పవన్ తెలిపారు. ప్రాథమిక సౌకర్యాలు లేకుంటే ప్రజలు ఉద్యమం చేస్తారన్నారు. ప్రజలు పన్నులు కడుతుంటే వైసీపీ నేతలు వాటిని దోపిడీ చేస్తున్నారని అన్నారు. రోజులు మారాయని.. మాటలతో మోసం చేయలేమని సీఎం జగన్ గ్రహించాలన్నారు పవన్.
జనసేన అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని మించిన ఆరోగ్య పాలసీ తెస్తామని చెప్పుకొచ్చారు. వచ్చే పాతికేళ్లు ఈ నేల కోసం గొడ్డు చాకిరీ చేస్తానన్నారు. మాస్టర్ప్లాన్ తయారుచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ పాలన పోవాలి.. జనసేన రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఏపీ పారిశ్రామికంగా వెనుకబడిందని.. వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇవ్వలేకపోతుందని విమర్శలు చేశారు. నాలుగేళ్లుగా సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని జనంలో తిరిగితే పాలన ఎలా ఉందో అని తెలుస్తోందన్నారు. ఆయుధం అంటే కత్తులు కాదని.. గొంతే ఆయుధం కావాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. రౌడీ మూకలను తన్ని తరిమేస్తామన్నారు. నర్సాపురం ప్రజలు రౌడీలకు, కత్తులకు భయపడరన్నారు. నాలుగేళ్ల కాలంలో ప్రజలకు నరకం చూపించారని.. సీఎం జగన్ నొక్కాల్సిన బటన్ నొక్కడం లేదన్నారు.
Next Story