Mon Dec 23 2024 03:11:06 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చేది మన ప్రభుత్వమే : పవన్ కల్యాణ్
2024లో ఏర్పడేది జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు
2024లో ఏర్పడేది జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని ఆయన తెలిపారు. అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విలువలు, ఆశయాల కోసం పార్టీని నడుపుతున్నానని పవన్ తెలిపారు. వైసీపీ పతనం మొదలయిందని ఆయన అన్నారు. జగన్ ఓడిపోవడం ఖాయమని, జనసేన గెలవడం తథ్యమని పవన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రధానినే ప్రశ్నించానన్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని ఆయన అన్నారు. వైసీపీ సన్నాసులందరూ తాను డబ్బులు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారని, తనకు డబ్బు తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. తనకు డబ్బు మీద వ్యామోహం లేదని, అందుకే లక్ష కోట్లున్న జగన్ తో గొడవ పెట్టుకోగలుగుతున్నానని పవన్ అన్నారు.
ధైర్యంగా ఎదుర్కొంటూ...
తాను ధైర్యంగా జగన్ ను ఎదుర్కొంటున్నానని చెప్పారు. యువత ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారని ఆయన అన్నారుె. ఓట్లు చీలిపోవడం వల్ల ఐదేళ్ల కాలం నాశనమయిందన్నారు. మెగా డీఎస్పీ అభ్యర్థులకు అండగా నిలుస్తాని చెప్పారు. ఓట్లను చీలనివ్వమని తెలిపారు. కురక్షేత్ర యుద్ధంలో తాము పాండవులు, వాళ్లు కౌరవులం అని ఆయన అన్నారు. గత పదేళ్ల కాలంలో తమ పార్టీ అనేక రకాలుగా దెబ్బతినిందని చెప్పారు. మనం, మన పార్టీ కంటే మన నేల ముఖ్యమని తెలిపారు. మద్యపాన నిషేధం నుంచి డీఎస్సీ వరకూ జగన్ మాట తప్పారన్నారు. అనుభజ్ఞులను జైలులో పెట్టిన వ్యక్తితో తాను తలపడుతున్నానని ఆయన చెప్పారు. జగన్ పతనం మొదలయిందన్నారు.
మాట ఇస్తే తప్పను...
తాను మాట ఇస్తే తప్పేవాడిని కాదన్నారు. తాను కోరుకునేదల్లా జనసేనను ఆదరించి, జగన్ ఓడించడమే. మీ విలువైన భవిష్యత్ ను గురించి ఆలోచించి ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు. డ్రాప్ అవుట్స్ మిస్సింగ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జగన్ వేలకోట్ల అవినీతి చేసినట్లు రుజువైందన్నారు. తాను మూడు తరాలుగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తితో పోరాటం చేస్తున్నానని చెప్పారు. తాను ఆత్మగౌరవంతో బతుకుతున్నానని తెలిపారు. నా సినిమాలు ఆపినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఇన్నాళ్లూ రాజకీయ నేతలతో పోరాటం చేశావని, ఇప్పుడు దేశభక్తి ఉన్న వ్యక్తితో తలపడుతున్నావని జగన్ కు సవాల్ విసిరారు.
మాఫియాలతో కలసి
ల్యాండ్, శాండ్ మాఫియాలతో వేల కోట్లు సంపాదించారన్నారు. అధికార మదం ఉన్న వ్యక్తులను ఎలా ఎదుర్కొనాలో తనకు తెలుసునని తెలిపారు. కాదనుకంటే తనపై కేసులు పెట్టుకోమన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కానని, ఏపీ తన నివాస స్థానమని చెప్పారు. 2019లో దేవుడని మొక్కితే దయ్యమై పట్టి పీడిస్తున్నాడని జగన్ పై విమర్శలు చేశారు. నేరగాళ్లను సమిష్టిగానే ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేల మాట తీరు చూస్తుంటేనే వారి పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని ఆయన చెప్పారు. 2024లో సుస్థిరమైన ప్రభుత్వం కావాలనే తాను ఓట్లు చీలనివ్వకూడదని అనుకున్నానని, తనకు కులం కంటే గుణంముఖ్యమని అన్నారు.
వైసీపీని తన్ని తరిమేస్తా...
జగన్ లాగా అన్ని కీలకమైన పదవులు ఒకే కులంతో నింపే విధానం తనకు కాదని అన్నారు. అలాంటివి జరగనివ్వకుండా వచ్చే ప్రభుత్వంలో బాధ్యతను తాను తీసుకుంటామని తెలిపారు. తన అభిమానుల్లో అన్ని కులాల వారున్నారని ఆయన చెప్పారు. వైసీపీ మహమ్మారికి ఒకటే వ్యాక్సిన్... జనసేన, టీడీపీయేనని అన్నారు. ఫ్యాన్ ఇక తిరగదన్నారు. జనసేన గ్లాస్ గొంతులో దాహం తీర్చగలదని, సైకిల్ గుర్తు ఒక చోట నుంచి మరొక చోటకు తీసుకెళుతుందన్నారు. వైసీపీని రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తానని ఆయన హెచ్చరించారు. తనను కాపుల చేతనే తిట్టిస్తున్నారని అన్నారు.తాను ఒక పాతికేళ్లు జనం కోసం పనిచేస్తానని చెప్పారు.
Next Story