Jc Prabhakar Reddy : జేసీ ఏకాకిగా మారారా? ఇంతమందితో వైరమా?
జేసీ ప్రభాకర రెడ్డి సొంత పార్టీ నేతలకే కాదు.. సొంత సామాజికవర్గం నేతలకు కూడా విలన్ గా మారారు.
జేసీ ప్రభాకర రెడ్డి సొంత పార్టీ నేతలకే కాదు.. సొంత సామాజికవర్గం నేతలకు కూడా విలన్ గా మారారు. ఆయన పెట్టుకుంటున్న విభేదాలు ఆయనకు మరింత ఇబ్బందిని తెచ్చి పెడతాయంటున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఒక హిస్టరీ ఉంది. అదే సమయంలో జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో జేసీ వేలు పెట్టడంతో అనేక మంది సొంత పార్టీ అంటే టీడీపీ నేతలే వ్యతిరేకమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టడమేంటని పుటపర్లి, అనంతపురం, రాయదుర్గం, కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలనే తన శత్రువులుగా మార్చుకున్నారు. అక్కడ తన అనుచరులకు అందం ఎక్కించాలన్న ఆశతో ఆయన అక్కడ ఉన్న అసలైన నేతలకు దూరమయ్యారు. అందుకే గత ఎన్నికల్లో జేసీ కుటుంబానికి కేవలం తాడిపత్రి నియోజకవర్గమే అధినాయకత్వం ఇచ్చింది. అనంతపురం పార్లమెంటు స్థానం కావాలని భావించినా చంద్రబాబు నాయుడు అంగీకరించనది జిల్లా నేతల నుంచి జేసీ పై వస్తున్న వ్యతిరేకతే కారణం.
సొంత పార్టీ నేతలతో…
ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శత్రువులను పెంచుకుని కత్తి లేకుండా జేసీ యుద్ధం చేస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి కొంత రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న సమయంలో ఇంతటి వ్యతిరేకత లేదు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వ బాధ్యతలను తీసుకున్న తర్వాతే ఎక్కువ విభేదాలు తలెత్తాయని అంటారు. జేసీ దివాకర్ రెడ్డిితో పోలిస్తే ప్రభాకర్ రెడ్డి దూకుడుగా ఉండటమే కాకుండా, మాటలు కూడా కటువుగా ఉండటంతో పార్టీ నేతలే ఆయనకు దూరంగా ఉండటం ప్రారంభించారు. ఎవరూ ఆయన వద్దకు వెళ్లి పలకరించే సాహసాన్ని కూడా చేయరు. కనీసం ఆయనను పార్టీ నేతగా చూసే అవకాశాన్ని కూడా వారు ఇవ్వడం లేదు. ఏమాత్రం తాము తగ్గినట్లు కనిపిస్తే తమ నియోజకవర్గంలో ఎక్కడ వేలుపెడతారో? అన్న సందేహంతో జేసీ తో అంటీముట్టనట్లు వ్యవరిస్తున్నారు. పార్టీ అధినాయకత్వానికి లెక్కకు మించిన సార్లు ఫిర్యాదుకూడా చేశారు. అయితే తాడిపత్రిలో ఉన్న బలం, బలగాన్ని పార్టీ హైకమాండ్ ఆయనకు ఆ మాత్రం ప్రయారిటీ అయినా ఇస్తుందన్నది వాస్తవం.
ఆదితో గొడవతో…
మరోవైపు తాజాగా బీజేపీకి చెందిన ఆదినారాయణరెడ్డి తో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వైరానికి దిగారు. కడప ఆర్టీపీపీ విషయంలో నేరుగా కయ్యానికి దిగడంతో ఇప్పుడు ఆది వర్గం కూడా జేసీ పై గుర్రుమంటోంది. కడప జిల్లాలో జేసీ పెత్తనమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు జేసీ ససేమిరా అనడంతో ఇది చినికి చినికి గాలివానలా మారి ముఖ్యమంత్రి వద్దకు పంచాయతీ చేరింది. పంచాయతీకి కూడా రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉండి నేనింతే నని సంకేతాలను పంపడంతో ఫ్లై యాష్ విషయంలో చివరకు ఆదినారాయణ రెడ్డి వర్గానిదే పై చేయిగా మారింది. రాజీ దోరణి అనేది ఉండదు. అలాగే సంయమనంతో సమస్యను పరిష్కరించుకుందామన్న ధ్యాస ఉండదు. కేవలం దూకుడుగా వెళ్లి తనకు కావాల్సిన పనిని తాను చేసుకుందామని ఆయన భావించడమే ఇప్పుడు జేసీ వర్గానికి మింగుడు పడటం లేదు. కానీ ఆయన వద్ద నేరుగా ప్రస్తావించలేని కొందరు తమ వ్యాపారాల కోసం ఇతర మార్గాలన చూసుకుంటున్నారు. ఆదినారాయణ రెడ్డి పేరుకు బీజేపీలో ఉన్నా ఆయనకు టీడీపీలో ఉన్న నేతల మద్దతు పుష్కలంగా ఉండటంతో జేసీ బూడిద కాంట్రాక్టు విషయంలో ఒంటరియ్యారనే చెబుతున్నారుు. అందుకే పార్టీ అధినాయకత్వం కూడా ఆది నారాయణ రెడ్డి వెంట ఉండటంతో జేసీకి అర్థమయినా ఆయన దూకుడు మాత్రం ఆగడం లేదు.
తాడిపత్రికే పరిమితం కాకుండా…
ఇక సొంత పార్టీ నేతలు అటు ఉంచితే.. ఇక తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేస్తున్నారు. సరే.. ఆయనంటే నియోజకవర్గంలో శత్రువుగా పరిగణించవచ్చు. కానీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గొడవకు దిగారు. అనంతపురంలో కళాశాల స్థలాన్ని అనంత వెంకట్రామిరెడ్డి ఆక్రమించకున్నారని, దానిని తిరిగి తాను ప్రభుత్వం స్వాధీనం చేస్తానని చెబుతున్నారు. దీంతో సొంత సామాజికవర్గం నేతలతో ఈ గొడవలేంటని పలువురు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జేసీ ఆగడం లేదు. తాను అనుకున్న దారిలోనే ఆయన వెళుతున్నారు తప్పించి ఎవరి సలహాలు స్వీకరించకపోతుండటం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొంత వ్యతిరేక రెడ్డి సామాజికవర్గంలో పెరగడానికి కారణమయిందని చెప్పాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి తాను తాడిపత్రి వరకూ పరిమితమయి అక్కడే రాజకీయాలు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ అదే తాను అన్ని నియోజకవర్గాల్లో వేలు పెట్టాలని చూస్తూ అందరూ ఏకమై జేసీని ఏకాకిని చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జేసీ ఏకాకి అయ్యారన్న వారు అనేక మంది ఉన్నారు. మరి జేసీ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.