Thu Dec 26 2024 21:10:11 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికే సమయం పడుతుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు కడపజిల్లాయే పెద్ద సమస్యగా మారింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు కడపజిల్లాయే పెద్ద సమస్యగా మారింది. తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికే ఆయన ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 నుంచి 2024 వరకూ చంద్రబాబును ఇబ్బందిపెట్టినట్లుగానే,నాడు కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లే ఇప్పుడు పులివెందులతో పాటు కడపజిల్లాను కూడా చంద్రబాబు అండ్ టీం టార్గెట్ చేసింది. అందుకే జగన్ ఎక్కువగా బెంగళూరు నుంచిపులివెందులకు తిరుగుతూ కడప జిల్లా నేతలతో సమావేశమవుతూ వారు జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత జిల్లాలో తనకు గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ రాకుండా ప్రయత్నాలను ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముందు...
వచ్చే నెల మూడో వారం నుంచి జగన్ జిల్లాల పర్యటన చేస్తానని చెప్పారు. అయితే మిగిలిన జిల్లాల్లో నేతలు, క్యాడర్ కొంత బాగానే ఉన్నప్పటికీ కడప జిల్లాలోనే పార్టీ బలహీనమయిందంటున్నారు. కడప జిల్లాలో పార్టీ నేతలు కూడా పెద్దగా వైసీపీకి ఉపయోగపడకుండా మౌనంగా ఉన్నారని భావిస్తున్నారు. 2019 నియోజకవర్గాల్లో పదికి పది నియోజకవర్గాల్లో గెలిచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దూరంగా ఉంటున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి సొంత మేనమామ అయిన కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాధ్ రెడ్డి కూడా గాయబ్ అయ్యారు.ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించింది లేదు.
ఎక్కువ ఫోకస్ పెట్టాలని...
దీంతో కడప జిల్లాపైనే జగన్ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జమ్మలమడక నియోజకవర్గంలోనూ సుధీర్ రెడ్డి అక్కడ క్యాడర్ కు అందుబాటులో లేకుండాపోయారు. తన ఓటమిని జీర్ణించుకోలేక ఆయన గత ఏడు నెలల నుంచి పత్తా లేకుండా పోయారు. అక్కడ క్యాడర్ ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యనేత గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన ఐదేళ్లకాలంలో మంత్రి పదవిదక్కలేదన్న అసంతృప్తిలోనే ఇంకా ఉన్నట్లుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత అప్పుడప్పుడు అలా కనిపించి మ.. మ అనిపించి వెళ్లిపోతున్నారు. జగన్ తో తొలి నుంచి అడుగులు వేసినఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయారిటీ లేదని భావించి శ్రీకాంత్ రెడ్డి మౌనంగా ఉన్నట్లే కనిపిస్తుంది.
కొత్త నాయకత్వానికి...
మైదుకూరు నియోజకవర్గంలో రఘురామిరెడ్డి వయసు రీత్యా కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడూ తాను ఉన్నానంటూ మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు. ఇలా దాదాపు అన్నినియోజకవర్గాల్లోనూ నేతలు పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్ర పర్యటనకు ముందు కడప జిల్లాలో పార్టీని వైఎస్ జగన్ సరిదిద్దుకోవాల్సి ఉంది. లేకపోతే వచ్చేఎన్నికలలో అసలుకే మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. అందుకే కడప జిల్లా నేతలతో వరసగా సమావేశం అవుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాలో కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ కూడా వినపడుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story