Mon Nov 18 2024 13:40:16 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో 30 మందికి అస్వస్థత.. చాక్లెట్లే కారణమా ?
కాగా.. తొలుత విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అందరూ భావించారు. అయితే.. అందుకు ఆస్కారం లేదని..
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారందరినీ జీజీహెచ్ కు తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 18 మంది ఆరోగ్యం విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారంతా స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. ఉదయం 9-10 గంటల మధ్యలో 5,6 తరగతుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గుండెల్లో మంటగా ఉందంటూ రోధించారు. కొందరైతే ఊపిరిరాడక కుప్పకూలిపోయారు.
కాగా.. తొలుత విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అందరూ భావించారు. అయితే.. అందుకు ఆస్కారం లేదని స్కూల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. విద్యార్థులంతా ఎవరి ఫుడ్ వారు ఇంటి నుంచి తెచ్చుకుంటారని, అందరూ కలిసి ఒకే ఫుడ్ తినే చాన్సే లేదన్నారు.ఆ తర్వాత వాయు కాలుష్యం కారణంగా అస్వస్థతకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వాదననూ పాఠశాల ప్రిన్సిపల్ తోసిపుచ్చారు. అదే జరిగి ఉంటే.. కేవలం రెండు క్లాసుల విద్యార్థులే ఎందుకు అనారోగ్యానికి గురవుతారని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన వినిపిస్తోంది. పుట్టిన రోజు సందర్భంగా ఓ విద్యార్థి.. ఉదయం చాక్లెట్లు పంచాడని, అవే అనారోగ్యానికి కారణం కావొచ్చని స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు. కానీ ఓ విద్యార్థి తాను చాక్లెట్ తినలేదని.. ఎందుకిలా జరిగిందో తెలియదని మీడియాకు తెలిపాడు. మరి విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏమై ఉంటుందన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న కాకినాడ ఆర్డీవో.. హుటాహుటిన కేంద్రీయ విద్యాలయానికి చేరుకున్నారు. చిన్నారులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై అధికారులను వివరణ కోరారు.
Next Story