Mon Dec 23 2024 06:22:08 GMT+0000 (Coordinated Universal Time)
సోషల్ మీడియాలో కాణిపాకం వినాయకుని మూలవిరాట్ ఫొటోలు.. నెటిజన్లు ఫైర్
ఏప్రిల్ 11న కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి కటుంబ సమేతంగా దర్శించుకుని.. గర్భగుడిలో..
ప్రముఖ ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో మూలవిరాట్టుల ఫొటోలు తీయకూడదన్న నిబంధనలు ఉంటాయి. కొన్ని ఆలయాల్లో ఈ కారణం చేతనే మొబైల్ ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. అయితే తాజాగా.. చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఒరిజనల్ ఫోటోలు ఫేస్ బుక్ లో కనిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అని సమాచారం.
ఏప్రిల్ 11న కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి కటుంబ సమేతంగా దర్శించుకుని.. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో చైర్మన్ అనుచరులు ఏకంగా వరసిద్ధి వినాయకునికి మూలవిరాట్ ను ఫోటోలు తీశారు. అంతటితో ఊరుకోకుండా వాటిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మూలవిరాట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో దేవాలయంలో భద్రత ఎంత వరకు ఉందో ఈ ఘటన ద్వారా తెలుస్తోందంటూ భక్తులు మండిపడుతున్నారు.
సాధారణంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను తనిఖీ చేసినట్టే.. ఇలాంటి వారిని తనిఖీ చేయరా ? వారి వెంటే ఉన్న అనుచరులు ఏం చేస్తున్నారా గమనించరా ? అని ప్రశ్నిస్తున్నారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న కాణిపాకం ఆలయంలో మూలవిరాట్టు ఫొటోలను ఇలా సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Next Story