Thu Dec 19 2024 09:57:58 GMT+0000 (Coordinated Universal Time)
Volunteers : వాలంటీర్లు ఇక లేనట్లేనా?.. మంగళం పాడేసినట్లే కనిపిస్తుందిగా?
వాలంటీర్లను కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు
వాలంటీర్లను కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే వారిని తప్పించేందుకే ఎక్కువ అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. వాలంటీర్ల వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. ప్రతి ఇంటికీ పథకాలను తీసుకెళ్లడంతో పాటు అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడంలో వాలంటీర్లు కీలక భూమిక పోషించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థ ఫుల్లు సక్సెస్ అయిందని భావించారు. పింఛన్ల దగ్గర నుంచి అన్నీ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తుండటంతో ప్రజలు కూడా ఖుషీ అయ్యారు. తమకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాలంటీర్ తో చెబితే క్షణాల్లో పని అయిపోతుండటంతో ప్రజలు కూడా ఈ వ్యవస్థను ఆదరించారు.
తొలి నుంచి చంద్రబాబు...
అయితే తొలి నుంచి వాలంటరీ వ్యవస్థపై ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెదవి విరుస్తున్నారు. వైసీపీ నేతలు తమ ముఖ్యకార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీీపీ చేసే ప్రయత్నంలో భాగమని ఈ వ్యవస్థను అనేకసార్లు వ్యతిరేకించారు. అయితే ఎన్నికల్లో ఇబ్బందవుతుందని భావించి చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థపై సానుకూలంగా స్పందించారు. కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరివల్ల ఉపయోగమేంది అన్న చర్చ అధకార పార్టీలో మొదలయింది. అయితే ఇద్దరు నేతలు ఎన్నికల సమయంలో మాత్రం తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూ వచ్చారు.నెలకు ఐదు వేలు కాదు పదివేల రూపాయలు వేతనం ఇస్తామని ఎన్నికల మ్యానిఫేస్టోలో కూడా పెట్టారు.
జులై నెల పింఛను కూడా...
కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్న విషయంపై పార్టీలో చర్చ జరుగుతుంది. వాలంటీర్లు అందరూ వైసీపీ ప్రభుత్వం నియమించిన వారు కావడంతో పాటు వారు ఆ పార్టీకి సానుభూతిపరులని భావించిన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ దూరం పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. పైగా ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా అనేక మంది అంటే దాదాపు లక్ష మందికి పైగా రాజీనామా చేశారు. ఏపీలో మొత్తం 2.57 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ఇప్పుడు జులై నెల పింఛను కూడా వాలంటీర్ల చేత కాకుండా సచివాలయం సిబ్బంది చేత పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా ఈ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అన్న ఆలోచనలో భాగమేనని అంటున్నారు. కొనసాగించాలంటే ఇప్పుడున్న వాలంటీర్లను తొలగించి కొత్తవారిని నియమించడం ఒక ఆప్షన్
హైకోర్టులో పిటీషన్...
లేకుంటే పూర్తిగా ఈవ్యవస్థను రద్దు చేయడం మరో ఆప్షన్. వాలంటీర్ల వ్యవస్థపై తాజాగా హైకోర్టులో పిటీషన్ పడింది. రాష్ట్రంలో నియమితులైన2.57 లక్షల మంది వాలంటీర్ల నియామకంలో గత ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. నియామకంలో రిజర్వేషన్లను పాటించలేదని తెలిపారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా తమను బెదిరించి నాడు వైసీపీ నేతలు రాజీనామా చేయించారని పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఈ వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్న దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలియవచ్చింది. మొత్తం మీద జులై నెల పింఛను సచివాలయం సిబ్బందితోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాలంటీర్ల వ్యవస్థ మనుగడపై అనుమానాలు బయలుదేరాయి. మరి దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Next Story