Mon Nov 18 2024 05:49:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కేబినెట్ కీలక సమావేశం
ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉద్యోగుల డిమాండ్లపై మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సిపిఎస్ రద్దు చేసి కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇక త్వరలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టుతో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇకపోతే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు, పీఆర్సీ, డీఏ బకాయిలు 16 వాయిదాల్లో చెల్లించేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీపీఎస్ స్థానంలో కొత్త విధానానికి ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. పాత పింఛను పథకానికి సమానంగా ఉండే పథకాన్ని తీసుకురానున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వచ్చే 50% పింఛనుకు తగ్గకుండా, అలాగే డీఏ క్రమంగా పెరిగేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీ కేబినెట్ భేటీ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిపిఎస్ రద్దుపై సీఎం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారని, మంత్రివర్గ సమావేశంలో దీనిపై మంచి నిర్ణయం ఉంటుందని అన్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి సీఎం జగన్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వెళతారు. మలికిపురం చేరుకొని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.
Next Story