Mon Dec 23 2024 06:11:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రశాంత్ నీల్ యాభై లక్షల విరాళం
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన స్వగ్రామానికి యాభై లక్షల విరాళం అందించారు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన స్వగ్రామానికి యాభై లక్షల విరాళం అందించారు. తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. ప్రశాంత్ నీల్ సొంత ఊరు అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురం గ్రామం. ఆ గ్రామంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ప్రశాంత్ నీల్ యాభై లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడం విశేషం.
నీలకంఠాపురానికి వచ్చి....
ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రముఖ దర్శకుడిగా మారారు. ఆయన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు. నీలకంఠాపురానికి నిన్న ప్రశాంత్ నీల్ వచ్చారు. తన తండ్రి జయంతి సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారని రఘువీరారెడ్డి ట్వీట్ చేశారు. నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి నిర్మించిన ఆలయాలను కూడా ప్రశాంత్ నీల్ దర్శించుకున్నారు.
Next Story