Mon Dec 23 2024 10:01:32 GMT+0000 (Coordinated Universal Time)
భౌగోళిక గుర్తింపు పొందనున్న ఆత్రేయపురం పూతరేకులు
400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం విశాఖపట్నం దామోదరం..
పూతరేకులు.. అనగానే గుర్తొచ్చేది ఆత్రేయపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆత్రేయపురం పూతరేకులకు పెట్టింది పేరు. రుచి అద్భుతంగా ఉంటుంది. వాటి మాధుర్యం మైమరిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ, విదేశాలకు కూడా ఆత్రేయపురం పూతరేకులు కొరియర్లలో వెళ్తుంటాయి. ఆత్రేయపురం అనే ఆ గ్రామం.. పూతరేకుల ద్వారానే ప్రసిద్ధి చెందింది. పూతరేకులు తయారు చేయడం ఇక్కడి ప్రజలకు ఉన్న కళ. ఎన్నో ఏళ్లుగా ఆత్రేయ పురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. మరో నాలుగు నెలల్లో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ రానుంది. త్వరలోనే ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు దక్కనుంది.
400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం విశాఖపట్నం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం సహకారంతో భౌగోళిక గుర్తింపు కోసం చేసుకున్న దరఖాస్తు పరిశీలన కూడా పూర్తయింది. వాణిజ్య పరిశ్రమల శాఖ ఫిబ్రవరి 13న విడుదల చేసిన జర్నల్ లో ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపుపై ప్రకటన ఇచ్చారు. చెన్నైలో ఉన్న జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులు, కళలు, ఆహార ఉత్పత్తుల గుర్తింపు కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి.. అభ్యంతరాలకు ప్రకటన జారీ చేస్తుంది. భౌగోళిక గుర్తింపు పొందాలనుకున్నవాటిపై ఎవరు అభ్యంతరాలు తెలుపకపోతే.. వాటికి భౌగోళిక గుర్తింపు ఇస్తున్నట్లు పేర్కొంటూ జర్నల్ ప్రచురిస్తుంది. ప్రస్తుతం ఆత్రేయపురం పూతరేకుల అంశం జర్నల్ ప్రకటన వరకూ వచ్చింది. త్వరలోనే వీటికి జీఐ ట్యాగ్ వస్తుందని సహకార సంఘం, పూతరేకులు తయారు చేసే మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Next Story