తిరుమల-అలిపిరి నడక దారిలో చిరుత దాడి
తిరుమల-అలిపిరి నడక దారిలో గురువారం చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు.
తిరుమల-అలిపిరి నడక దారిలో గురువారం చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కర్నూలు జిల్లా అదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)ను తీసుకుని నడక దారిలో తిరుమలకు బయలుదేరారు. మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం కోసం ఆగారు. బాలుడు ఆ పక్కనే ఆడుకుంటూ ఉండగా.. వెనక నుంచి వచ్చిన ఓ చిరుత బాలుడిని నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. స్థానికులు, భద్రతాసిబ్బంది, తల్లిదండ్రులు పెద్దపెట్టున కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. రాళ్లు రువ్వుతూ, కేకలు వేస్తూ చిరుతను బెదిరించారు. దీంతో చిరుత బాలుడిని పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చెవి వెనుక భాగం, తలపై పలు చోట్ల గాయాలను వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. బాలుడి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు చెప్పారు.