Fri Nov 22 2024 22:23:36 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ టెన్షన్ పెడుతున్న చిరుత
తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం మొదలవ్వడం
తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం మొదలవ్వడం భక్తులను టెన్షన్ పెడుతోంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుతపులి, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నెల 24 నుంచి 27 మధ్యన ఈ దృశ్యాలు నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. చిరుత, ఎలుగుబంటి సంచారం నేపథ్యంలో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గంపులుగా వెళ్లాలని సూచించింది. చిరుతను, ఎలుగుబంటిని బంధించేందుకు ఫారెస్టు అధికారులతో కలిసి చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది.
చిరుతపులుల సంచారం నేపథ్యంలో.. నడక మార్గంలో వెళ్లే భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా భక్తుల చేతికి కర్రలు ఇస్తోంది. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తూ.. బృందానికి ఒకరు చొప్పున గార్డును నియమించింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిన్నారులను నడక మార్గంలో అనుమతించడంలేదు. చిన్నారులకు ట్యాగింగ్ను కూడా ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ఆగస్టు 11న తిరుమల మెట్ల మార్గంలో లక్షిత అనే చిన్నారిపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. అప్పటి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడి ఘటనతో అప్రమత్తమైన టీటీడీ.. అటవీ శాఖ అధికారులతో కలిసి తిరుమల కొండల్లో పలుచోట్ల బోన్లను, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది.
Next Story