Mon Dec 23 2024 13:52:37 GMT+0000 (Coordinated Universal Time)
మహాసేన రాజేష్ సంచలన ప్రకటన.. నెక్ట్స్ ఎవరు?
తెలుగుదేశం-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పుడు ఓ వ్యక్తి పేరు
తెలుగుదేశం-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పుడు ఓ వ్యక్తి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమిటంటే 'మహాసేన రాజేష్'. పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే మహా సేన రాజేష్ అర్హుడే కాడంటూ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మహాసేన రాజేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించమని పలువురు బహిరంగంగా విమర్శించారు. గతంలో కొన్ని కులాలను ఉద్దేశించి మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యాయి. పలు కుల సంఘాలు మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. జనసేనకు పి.గన్నవరం టిక్కెట్ దక్కుతుందని భావించిన జనసేన మద్దతుదారులు కూడా వారితో చేరారు.
ఇలాంటి సమయంలో మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. నేను మళ్లీ కుల రాక్షసుడికి బలి అయ్యాను. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది జగన్ రెడ్డి. నా పార్టీ గురించి, చంద్రబాబు గారినీ, లోకేష్ గారినీ, పవన్ కళ్యాణ్ గారినీ నా విషయంలో చెడుగా మాట్లాడకండి. నేను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నానని రాజేష్ తన ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు. ఒక సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కులరక్కసి చేతిలో బలైపోయానని.. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజేష్ చెప్పుకొచ్చారు.
Next Story