Fri Nov 22 2024 18:21:12 GMT+0000 (Coordinated Universal Time)
"మేము విచారణకు హాజరు కాలేము"- రామోజీ, శైలజా కిరణ్
గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2 శైలజ
గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2 శైలజ కిరణ్ తెలిపారు. అనారోగ్య కారణాలతో రామోజీరావు రాలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ఈ–మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 5న గుంటూరులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రామోజీరావు, శైలజ కిరణ్‌లకు సీఐడీ అధికారులు సీఆర్పీసీ 41(ఏ) కింద గత నెల 22న నోటీసులు జారీ చేశారు. అయితే తాము విచారణకు హాజరుకాలేమని రామోజీరావు, శైలజ కిరణ్ మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైదరాబాద్‌లో ఆగస్టు 31, 1962న స్థాపించారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం శాఖల సంఖ్య 37 కాగా 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి 1.04 లక్షల మంది చందాదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వార్షిక టర్నోవర్ రూ. 9,677 కోట్లుగా ఉంది. చిట్ ఫండ్ చట్టం, 1982 ప్రకారం మార్గదర్శి గ్రూప్ బ్యాలెన్స్ షీట్ లను దాఖలు చేయలేదని సీఐడీ విచారణలో తేలింది. ఎన్నో అవకతవకలు గుర్తించామని.. విచారణ సమయంలో, మనీలాండరింగ్, నిధులను స్వాహా చేయడం, కార్పొరేట్ మోసాలు, బినామీ లావాదేవీలు బయటపడ్డాయని సీఐడీ అధికారులు తెలిపారు. ఒక గ్రూపు నుంచి వచ్చిన చిట్ ఫండ్ సొమ్మును మరో గ్రూపునకు మళ్లించినట్లు విచారణలో తేలింది. మొత్తం నిధులు ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌కు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
Next Story