Mon Dec 23 2024 13:24:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో సంక్రాంతి సెలవుల పొడిగింపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్
రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతుండటం, వ్యాప్తి క్రమంగా పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సెలవులను పొడిగించాలని
దేశంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలకు ఈనెలాఖరు వరకూ సంక్రాంతి సెలవులు పొడిగించాయి. ఏపీలో మాత్రం సంక్రాంతి సెలవుల అనంతరం.. తిరిగి జనవరి 17, సోమవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతుండటం, వ్యాప్తి క్రమంగా పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సెలవులను పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంక్రాంతి సెలవుల పొడిగింపుపై స్పందించారు.
Also Read : విషాదం.. పండుగ వేళ ప్రాణం తీసిన పల్లీలు
విద్యాసంస్థలకు సెలవులను పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచి రోజువారీ హాజరు తీసుకుంటున్నామన్న ఆయన.. పిల్లల ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. కొవిడ్ వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అనుసరించామని, ఈ ఏడాది పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందని వివరించారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందుల దృష్ట్యా పాఠశాలలు తిరిగి ప్రారంభించినట్లు వివరించారు.
Also Read : మరోసారి ఆస్పత్రిలో చేరిన కమల్ ?
రాష్ట్రంలో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులుండగా.. వారిలో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే బోధన కొనసాగుతుందని మంత్రి సురేష్ తెలిపారు. 150 రోజులు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని వెల్లడించారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నట్లు వివరించారు.
Next Story