Mon Dec 15 2025 08:04:24 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : పవన్ కంటే బర్రెలక్క బెటర్
తుఫానుపై ప్రభుత్వం ముందస్తు చర్యలతో పెద్ద ముప్పు తప్పిందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు

తుఫానుపై ప్రభుత్వం ముందస్తు చర్యలతో పెద్ద ముప్పు తప్పిందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి సంక్షోభాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు లాంటి షో వర్క్‌లు చేయడం జగన్ కు చేతకాదన్నారు. ముఖ్యంగా తుఫాను వంటి విపత్తు సమయంలో నేరుగా వెళ్లకుండా సహాయక చర్యలకు ఇబ్బంది కలిగించడం జగన్ కు ఇష్టం లేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు అనుకూల మీడియా కూడా జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందన్నారు.
పరిహారం వారికంటే ఎక్కువగా...
చంద్రబాబు కన్నా ఎక్కువ పరిహారం జగన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. జగన్ పై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందుతుందని ఆయన హామీ ఇచ్చారు. బాధితులను సీఎం పరామర్శించడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారన్నారు. కొత్త ప్రాజెక్టులను రాష్ట్రంలో నిర్మించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో కట్టలేదన్నారు. పూర్తి కావాల్సిన ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆయన అన్నారు.
టూరిస్టుల్లా వచ్చి....
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌కు ఏపీతో సంబంధం లేదన్నారు. అప్పుడప్పుడూ వచ్చి రాజకీయం చేస్తారని అన్నారు. టీడీపీ జెండా గాంధీభవన్ లో ఎగురుతుందన్నారు. చంద్రబాబు చేతిలో పచ్చ జెండా లేదని, ఎవరికి బడితే వాళ్లకు ఇచ్చేస్తున్నారన్నారు. కూకట్‌పల్లిలో మాత్రం జనసేనకు మద్దతివ్వలేదన్నారు. పవన్ పార్టీ తెలంగాణలో ఎనిమిది చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదన్నారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఎక్కువ సీట్లు కూడా ఇవ్వరని అన్నారు. రాష్ట్రంలో ఉర్లగడ్డల సమస్య కాదని, టీడీపీ, జనసేన క్యాన్సర్ గడ్డలు ప్రమాదకరమని అంబటి రాంబాబు అన్నారు.
Next Story

