Mon Dec 23 2024 09:15:27 GMT+0000 (Coordinated Universal Time)
అబ్బబ్బబ్బ.. ఏం డైలాగయ్యా.. పుట్టగతులుండవ్ : అంబటి
గతంలో రెండుసార్లు పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని, మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పవన్..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో జరిగే సభలో.. పవన్ ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై విమర్శలు చేస్తూ.. హెచ్చరికలు కూడా చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. నిన్న కాకినాడలో పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి అంబటి రాంబాబు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పవన్ ఒక పిరికిపంద అని, అందుకే ప్రాణహాని అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వారాహి అంటే అమ్మవారు.. అలాంటి అమ్మవారిని వాహనంగా పెట్టుకుని, ఆ వాహనంపై ఎక్కి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న పవన్ కు పుట్టగతులుండవన్నారు.
గతంలో రెండుసార్లు పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని, మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పవన్ ఓడిపోవడం ఖాయమని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి ఫైర్ అయ్యారు. "ఒక ఎమ్మెల్యేను బట్టలూడదీసి కొడతావా? అయ్యే పనేనా అది... నీకంత దమ్ము, ధైర్యం ఉన్నాయా? ప్రజాస్వామ్యంలో ఇది జరిగే పనేనా? నువ్వు ఇలాగే మాట్లాడితే చెప్పులే కాదు.. బట్టలు కూడా పోగొట్టుకుంటావు. బనియన్, కట్ డ్రాయర్ తో వచ్చి... నా బట్టలు కూడా పోయాయని చెబుతావు. నీ బతుకు అలా తయారవుతుంది. వైసీపీ గూండాలను ఇళ్లలోంచి బయటికి లాగి కొడతాడంట. ఏం మాటలయ్యా ఇవి. అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు ఇక ఏ సినిమా హిట్ కాదని, ఇది అమ్మవారి శాపం" అని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని, అలాంటపుడు ఆయనను చంపేందుకు రెక్కీ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఎన్నికల్లో ఓడించేందుకు రూ.200 కోట్లతో కుట్ర చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. పవన్ కు నిజంగానే ప్రాణహాని ఉంటే అందుకు ఆధారాలు చూపించాలని.. రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఓ ప్రభుత్వంగా మాకు ఉంటుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నానని అంబటి తెలిపారు. సానుభూతి కోసమే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. ఓవైపు ప్రాణహాని అంటాడు, మరోవైపు చేగువేరా స్ఫూర్తి అంటాడని విమర్శించారు. నాకు తెలిసినంతవరకు ఒక చెప్పు బీజేపీ ఆఫీసులో, మరో చెప్పు టీడీపీ ఆఫీసులో ఉండొచ్చు" అంటూ అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
Next Story