Mon Dec 23 2024 15:06:00 GMT+0000 (Coordinated Universal Time)
Botsa : ఎప్పటికైనా జగన్ పై దాడికి కారణం తెలియక మానదు
విశాఖ స్టీల్ ప్లాంట్ పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు
విశాఖ స్టీల్ ప్లాంట్ పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిన్న గాజువాక వచ్చిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని కూడా ప్రస్తావించలేదన్నారు. జగన్ యాక్టర్ కాదని, ఆయనకు నటించాల్సిన అవసరం లేదని అన్నారు. నటించే వాళ్లు బాగానే ఉన్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎవరికి దెబ్బతగిలినా, ప్రమాదం జరిగినా సంయమనం పాటించాలని, ఎద్దేవా చేసినట్లు మాట్లాడటమేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ పై ఫోర్స్ గా రాయి దాడి చేశారన్నారు. అన్నం తిన్నవాడు ఎవడూ అలా దెబ్బతగిలిన వారి గురించి మాట్లాడరన్నారు. మానవత్వం ఉన్న వారు ఎవరైనా స్పందిస్తారన్నారు.
నటించడం...
డ్రామాలు, నటించటం చంద్రబాబుకు తెలిసినంత ఎవరికీ తెలియదన్నారు. ముందు రోజే చంద్రబాబు జగన్ ను రాళ్లతో కొట్టాలని పిలుపునివ్వడం నిజం కాదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నేతలు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. ఎవరూ డ్రామాలకోసం తలపై రాళ్లతో కొట్టించుకోరని, ఎవరి ప్రాణం వారికి ముఖ్యమేనని బొత్స సత్యనారాయణ అన్నారు. లక్షలాది మంది జనం ఉన్నప్పుడు నిందితుడు దొరకడం కొంత కష్టమవుతుందని, అయితే తర్వాత అసలు నిందితుడు ఎవరు? ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడు? ఎవరు ప్రేరిపించారో తెలుస్తుందని అన్నారు.
Next Story