Mon Nov 18 2024 08:36:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విడుదలైన రోజే ఇంట్లో సినిమా చూసేయొచ్చు
రిలీజ్ రోజునే ఇంటివద్ద లైవ్ లో సినిమాను చూసేలా రూపొందించిన ఈ కార్యక్రమానికి విశాఖలోని పార్క్ హోటల్ లో శ్రీకారం చుట్టారు.
కొత్త సినిమా.. అందులోనూ అభిమాన హీరో సినిమా విడుదల అంటే థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఫస్ట్ డే నే సినిమాకు వెళ్లాలంటే కష్టమే. పెద్ద హీరోల సినిమాలైతే టికెట్లు కూడా దొరకవు. కాస్త తీరికగా చూడాలంటే సినిమా విడుదలైన వారం వరకూ ఆగాల్సిందే. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా విడుదలైన రోజే.. ఇంట్లోనే సినిమా చూసేయొచ్చు. ఏపీ సర్కార్ ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకు కల్పించనుంది. కొత్త సినిమా విడుదలైన రోజే ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
రిలీజ్ రోజునే ఇంటివద్ద లైవ్ లో సినిమాను చూసేలా రూపొందించిన ఈ కార్యక్రమానికి విశాఖలోని పార్క్ హోటల్ లో శ్రీకారం చుట్టారు. మంత్రి అమర్నాథ్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమా 'నిరీక్షణ'ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదన్నారు. సినిమా విడుదలైన రోజే కుటుంబమంతా కలిసి ఇంటివద్దే సినిమాను చూడవచ్చన్నారు. సినిమా విడుదల రోజునే కుటుంబం అంతా కలిసి ఇంటి వద్దే సినిమా చూడొచ్చని తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ద్వారా గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. సంక్షేమ పథకాలతో పాటు వినోదాన్ని కూడా ప్రజలకు అందించాలని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ.. 148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే ఇంతవరకూ జరగలేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ కు సి కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.
Next Story