Mon Dec 23 2024 03:41:37 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నారా లోకేష్ ప్రజాదర్బార్ కు నేటికి యాభై రోజులు...వినతులకు సత్వరం పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేశారు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో గంట సేపు ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను స్వీకరిస్తూ వస్తున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు చేరువగా ఉండేందుకు లోకేష్ తీసుకు వచ్చిన ఈ ప్రజాదర్బార్ కు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోని ప్రజలు కూడా ప్రజాదర్బార్ కు వచ్చి లోకేష్ కు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అయితే వెంటనే అధికారులకు వాటిని అందించి సమస్యలకు పరిష్కారం దొరికేలా నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు.
వచ్చిన సమస్యలను...
సామాన్యులకు అండగా ఉండేలా ప్రజాదర్బార్ ను తీర్చి దిద్దారు. ఇప్పటి వరకూ యాభై రోజుల్లో ప్రజా దర్బార్ కు 5,810 వినతులను స్వీకరించారు. ఇందులో 4,410 సమస్యలకు పరిష్కారం ప్రజాదర్బార్ ద్వారా లోకేష్ చూపించగలిగారు. అధికారులకు నేరుగా లోకేష్ ఆదేశాలు జారీ చేస్తుండటంతో అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుండగా, కొన్ని జటిలమైన సమస్యల విషయంలో మాత్రం జిల్లా అధికారులకు పంపుతున్నారు. లోకేష్ నుంచి ఆదేశాలు వెళ్లడంతో అధికారులు కూడా సమస్యలకు వెంటనే పరిష్కారం చేస్తున్నారు.
75 శాతం సమస్యలను...
ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యల్లో 75 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయంటే లోకేష్ చెప్పిన వెంటనే అధికారులు ఏ మేరకు సమస్యలను పరిష్కరిస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 1,410 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50శాతం వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి కాగా ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి. భూవివాదాలకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా.. 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా.. 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందగా.. అర్హతలను బట్టి 347 మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు.
Next Story