విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు : మంత్రి పెద్దిరెడ్డి
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం జగన్ విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదన్నారు. ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సబ్ కమిటీ సమావేశం ఉందని.. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇటీవల ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యుత్ ఉద్యోగులు ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. 12 డిమాండ్లతో ఉద్యోగులు గత కొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. భోజన విరామ సమయాల్లో సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయాల్లో ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం.. ఉద్యోగులను చర్చలకు పిలిచింది. ఆ చర్చలు విఫలం కావడంతో 10వ తేదీ నుంచి సమ్మె సైరన్ మోగించాలని ఉద్యోగులు నిర్ణయించారు.