Sat Nov 23 2024 09:09:19 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పై మంత్రి రోజా విమర్శనాస్త్రాలు
విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, మంత్రులపై లోకేష్ చేసిన వ్యాఖ్యలను..
"యువగళం" పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నిన్నటి నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, మంత్రులపై లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయన పాండిత్యాన్ని చూస్తే.. పులకేశి అని అనాల్సిందేనన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డుపైకి వస్తున్నారని లోకేశ్ అన్న వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలు ఇచ్చారన్న విషయం గమనించాలని మంత్రి రోజా పేర్కొన్నారు.
దేశంలో.. ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో.. ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేపట్టారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారంతా ఇప్పుడు తమ కుటుంబాలతో ఆనందంగా ఉన్నారని రోజా వెల్లడించారు. నిజానికి రోడ్డుపైకి వచ్చింది నిరుద్యోగులు కాదని, చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లు రోడ్డుమీదికి వచ్చారని ఎద్దేవా చేశారు. దొంగదారిలో మంత్రైన లోకేష్.. తన తండ్రి నిర్మించనివి కూడా ఆయనే నిర్మించారని చెబుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ గురించి మాట్లాడేందుకు లోకేశ్ కు అర్హత లేదని స్పష్టం చేశారు.
Next Story